చుట్టాల రాకను ముందే చెప్పే కాకులు కనుమరుగైపోవడానికి కారణాలేంటి?

by GSrikanth |   ( Updated:2023-04-03 07:32:32.0  )
చుట్టాల రాకను ముందే చెప్పే కాకులు కనుమరుగైపోవడానికి కారణాలేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల్లో ఒకప్పుడు కాకులు గుంపులుగా కనిపించేవి. చెట్లపైనా, గోడలపైనా కావ్.. కావ్.. అంటూ కనిపించేవి. ఏ చిన్న దావత్ అయినా సరే.. అక్కడ వడ్డించే ప్లేస్ మొదలు విస్తర్లు పారేసే వరకు కలియదిరిగేవి. ఎక్కడ ఆహరం దొరుకుతుందా? అంటూ చక్కర్లు కొట్టేవి. ఇక కాకుల విషయంలో గ్రామాల్లో చాలా నమ్మకాలు ఉన్నాయి. కాకి ఇంటి వద్దకు వచ్చి అరుస్తుంటే ఎవరో చుట్టాలు వస్తారని భావించేవారు. మరో వైపు ప్రకృతి వైపరిత్యాలను సైతం ఇవి ముందుగానే పసిగడతాయని కొందరి నమ్మకం. ఇలా మానవునికి సంబంధించిన చాలా విషయాల్లో కాకులు ప్రత్యేకంగా నిలిచేవి. కానీ ప్రస్తుతం వీటి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నది. కనుమరుగైపోతున్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి రావడంతో పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

చెట్ల నరికివేత

గతంలో గ్రామాల్లో చెట్లు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఇంటి ఆవరణలో ఏదో ఒక చెట్టు ఉండేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ప్రస్తుతం అలాంటి స్థితి గ్రామాల్లో కనిపించడం లేదు. కాకులు అడవుల్లో నివాసం ఉండటం చాలా అరుదు. అవి గ్రామాల్లోని ఇండ్లు ఉన్న ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద చెట్లపైనే ఎక్కువగా నివసిస్తుంటాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన ఆహారం ఇలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా లభిస్తుంది. అందుకే అవి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసించేందుకు ఆసక్తి చూపుతాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కానీ గ్రామాల్లో ఒకప్పటి పరిస్థితులు లేవు. చాలా వరకు వివిధ కారణాలతో చెట్లను నరికేస్తున్నారు.

సెల్ ఫోన్ టవర్లు

ఒకప్పుడు గ్రామాల్లో సెల్ ఫోన్లు లేవు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జేబులో సెల్ తప్పనిసరిగా మారింది. అందువల్ల ప్రతి గ్రామంలో సెల్ టవర్లు ఏర్పాటయ్యాయి. ఫలితంగా టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా కాకులతో పాటు అనేక రకాల పక్షులు అంతరించిపోతున్నాయని పర్యావరణ వేత్తలు, పక్షు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

పిండం సమయంలో..

గ్రామాల్లో ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. ఎవరైనా చనిపోతే వారికి పిండం పెడతారు. వాటిని కాకులు ముడితేనే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తుంటారు. ఒక వేళ కాకులు వాటిని ముట్టకపోతే అరిష్టంగా భావిస్తుంటారు. ఇలాంటి సందర్భాన్నే ఇటీవల విడుదలైన ఓ తెలుగు సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం ఎదురవుతున్నాయి. పిండం ముట్టేందుకు కాకులు రాకపోవడంతో గంటలకొద్ది ఎదురు చూస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కాకులతో పాటు ఇతర పక్షుల సంఖ్య తగ్గిపోవడంతో చాలా వరకు పిండాలు ముట్టేందుకు పక్షులు రావడం లేదు. దీంతో కొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా వాటిని ఆవులకు, కుక్కలకు పెడుతున్నారు. ఇంకొన్ని చోట్ల చెరువులు, కాలువల్లో కలుపుతున్నారు. కాకులు, పక్షులు అంతరించి పోతున్నాయనడానికి ఇవి ఉదాహరణలు అంటూ పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలతో ఫింగర్ ప్రింట్ లాకింగ్ తీయవచ్చా..? నిపుణులు చెబుతుంది ఇదే!

Advertisement

Next Story