- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Children's Day : బాల్యం.. సతమతం..! ఉరకలెత్తే ఉత్సాహంపై ఒత్తిడి, టెక్నాలజీ ప్రభావం !!
దిశ, ఫీచర్స్ : బాల్యమంటే ఉరకలెత్తే ఉత్సాహం.. బాల్యమంటే ఏ బాధలూ లేని ఆనందమయ జీవితం. ప్రతీ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడంలో వారు బహు నేర్పరులు. ప్రతీ సందర్భాన్ని ఎంజాయ్ చేయడంలో వారు బాల కోవిదులు. అందుకే అంటారు బాల్యమొక వరమని, అదొక మధుర జ్ఞాపకమని. తిరిగి రాదని తెలిసినా.. వస్తే బాగుండని ప్రతి ఒక్కరూ కోరుకునే తీరని కోరిక ఏదైనా ఉంటుందంటే.. అది కేవలం బాల్యమే. అయితే ఓ వైపు చదువుల ఒత్తిడి, మరోవైపు టెక్నాలజీ ప్రభావం కారణంగా నేటి బాల్యం సతమతం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. రేపటి (నవంబర్ 14) చిల్డ్రన్స్ డే నేపథ్యాన్ని పురస్కరించుకొని అలాంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంత మేలో.. అంత నష్టం కూడా..
నేటి బాల్యం రేపటి తరాలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంటోందా? ఇక్కడే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పటిలా నేటి పిల్లలు బాల్య దశను ఎంజాయ్ చేయలేకపోతున్నారని చాలామంది తల్లిదండ్రులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదువుల ఒత్తిడి, ఆధునిక సాంకేతికతల నడుమ పసిప్రాయం నలిగిపోతోందన్న ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి. నిజానికి టెక్నాలజీ మానవ జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చింది. కొన్ని విషయాల్లో ఇది ఎంతలా మేలు చేసిందో, మరికొన్ని అంశాల్లో అంతలా నష్టం కూడా చేస్తోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బాల్య దశను ప్రభావితం చేస్తోంది. చదువులమ్మ ఒడిలో అక్షరాలు దిద్దుతున్న పసి ప్రాయాలను సైతం తన ఉచ్చులోకి లాగుతోంది.
ఆందోళనలు చుట్టు ముడుతున్నాయ్
ఒకవైపు చదువుల భారాన్ని, ఒత్తిడిని ఎదుర్కొంటున్న పిల్లలు, మరోవైపు టీవీలు, మొబైల్ ఫోన్లు, రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి ఉపయోగిస్తూ వ్యవసనాలకు బానిసలవుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా ప్రభావం కూడా పసిప్రాయాన్ని సతమతం చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు మన పెద్దలు బాల్యాన్ని ఎంజాయ్ చేసినంతగా నేటి పిల్లలు చేయడం లేదని అందరూ అంగీకరిస్తున్న విషయమే. చదువుకునే దశ నుంచే స్ట్రెస్, యాంగ్జైటీస్, ఒంటరిగా ఉన్నామనే భావనలు నేటి పిల్లలను చుట్టుముడుతున్నాయి. తరచుగా స్ర్కీన్లకు అతుక్కుపోవడం వంటి జీవనశైలి విధానాలు పిల్లల్లో ఆందోళనలు, అనారోగ్యాలను పెంచుతున్నాయి. టెక్నాలజీ వాడటంలో ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ, ఈతరం దానిని హ్యాండియల్ చేయడంలో మాత్రం ఇక్కడ పిల్లలు, పెద్దలు కూడా ఫెయిలవుతున్నారు.
ఆటల్లేవ్.. మాటల్లేవ్..
టెక్నాలజీ బాల్యాన్ని ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో ఆరుబయట ఆడుకోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడిపే సందర్భాలు పిల్లల్లో తగ్గుతున్నాయి. మనుషుల మధ్య కమ్యూనికేషన్‌ను టెక్నాలజీ, అన్ సైంటిఫిక్ ఆలోచనలు అడ్డుకుంటున్నాయి. సరదా, సంతోషం అంటే ఆరు బయట, ప్లే గ్రౌండ్స్‌లో ఆడుకోవడం, కుటుంబంతో కలిసి సరదాగా మాట్లాడుతూ గడపడం అని నేటి పిల్లలు అస్సలు అనుకోవడం లేదు. ఎందుకంటే వాటి స్థానాన్ని డిజిటల్ కమ్యూనికేషన్ పరికరాలు ఆక్రమించేశాయి.
అసలైన ఎంజాయ్‌మెంట్ ఎక్కడ?
మొబైల్ ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడటం, ఓటీటీల్లో సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో మునిగిపోవడం, రీల్స్ స్ర్కోల్ చేయడం ఇవే అసలైన ఎంజాయ్ మెంట్‌కు నిదర్శనంగా భావిస్తున్నారు ఈతరం పిల్లలు. ఈ పరిస్థితి మారితేనే పిల్లల్లో అసలైన ఆనందం వెల్లివిరుస్తుందని, మానసిక వికాసం కలుగుతుందని నిపుణులు చెప్తు్న్నారు. ఆధునిక సాంకేతికతను, మానవ సంబంధాలను బ్యాలన్స్ చేయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాధ్యత గల ప్రతి ఒక్కరూ ప్రయత్నించడంలో సక్సెస్ అయినప్పుడే పిల్లల్లో అసలైన ఆనందం, జ్ఞానం వికసిస్తాయి. వారి ఎదుగుదలకు తోడ్పడుతూ బంగారు భవితకు భరోసానిస్తాయి అంటున్నారు నిపుణులు.