పెరిగేకొద్దీ పిల్ల‌లు త‌ల్లి మాట విన‌రెందుకు..? స్ట‌డీలో ఆస‌క్తిక‌ర అంశాలు

by Sumithra |   ( Updated:2022-05-17 10:07:43.0  )
పెరిగేకొద్దీ పిల్ల‌లు త‌ల్లి మాట విన‌రెందుకు..? స్ట‌డీలో ఆస‌క్తిక‌ర అంశాలు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః త‌ల్లి పొత్తిళ్ల నుండే ప్ర‌పంచాన్ని చూసి, ప‌ల‌క‌డం నేర్చుకొని, న‌డ‌క నేర్చే వ‌ర‌కూ త‌ల్లి సోయే సుర‌క్షితమ‌నుకునే బిడ్డ, పెరిగే కొద్దీ త‌న త‌ల్లి మాటంటేనే ప‌డ‌న‌ట్లు త‌యార‌వ‌డం కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. ముఖ్యంగా త‌ల్లికి ఇది పెద్ద షాక్ కూడా. అయితే, ఇలాంటి ప‌రిణామం వెనుక శాస్త్రీయ కారణం ఉండొచ్చని అంటున్నారు ప‌రిశోధ‌కులు. ఓ అధ్యయనం ప్రకారం, పిల్లలు యుక్తవయస్సులోకి ప్రవేశించిన త‌ర్వాత‌ తల్లి స్వరంతో సంబంధాన్ని కోల్పోవచ్చని, దానికి తగ్గట్టుగా బిడ్డ బిహేవియ‌ర్ మారవచ్చని తెలుస్తోంది. పెరుతుగున్న కొద్దీ పిల్ల‌లు త‌ల్లి గొంతు కంటే ఇత‌ర‌ స్వరాలకు ట్యూన్ చేయడం ప్రారంభించ‌డ‌మే దానికి కార‌ణ‌మ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వివిధ సామాజిక ఉద్దీపనలకు ప్రతిస్పందించే పిల్ల‌ల్లో ఈ మార్పు వ‌స్తుంద‌ని అంటున్నారు. స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్య‌య‌నం జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో ప్రచురించారు.

ఈ స్ట‌డీలో పరిశోధకులు కొన్ని మెదడు ఎమ్ఆర్ఐ (MRI) స్కాన్‌లను ప‌రిశీలించి, యుక్తవయస్సులో పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి ఎలా వేరు అవుతారనే అంశంపై మొదటి న్యూరోబయోలాజికల్ వివరణను సంకలనం చేశారు. ఇందులో, పిల్లలు 13 ఏళ్లు వచ్చేసరికి తమ తల్లి స్వరం క‌టువుగా, అసౌక‌ర్యంగా భావించ‌వ‌చ్చ‌ని తెలిసింది. "పుట్టిన‌ప్పుడు తన తల్లి స్వరంతో ఎలా ట్యూన్ అయ్యేవారో, కౌమారదశకు వ‌చ్చే స‌మ‌యానికి వేర్వేరు స్వరాలకు ట్యూన్ అవ‌డం మొద‌ల‌వుతుంది. యుక్తవయసులో స్నేహితులు, కొత్త సహచరులు ఉంటారు. వారితో సమయం గడపాలని కోరుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కి టీవీలో వ‌చ్చే ప్రకటనల్లో తెలియని ఈ స్వరాలకు పిల్ల‌లు ఆకర్షితులవ‌డం" అంటూ ఈ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన ప్రధాన రచయిత డేనియల్ అబ్రమ్స్ అంటారు.

అబ్రమ్స్‌ నేతృత్వంలోని పరిశోధన ప్రకారం, టీనేజ్ మెదడు వారు వినే అన్ని స్వరాలకు ఎక్కువ గ్రహణశీలత కలిగి ఉంటుంది. అలాగే, ఈ వయస్సులో రివార్డ్ సర్క్యూట్ (మెప్పుపొంద‌డం)కు సంబంధించిన‌ మెదడు కేంద్రాలు ముఖ్యమైన ఉద్దీపనలకు ప్రాధాన్యతనిచ్చే మార్పు చెందుతాయి. త‌ద్వారా, ఈ మెదడు ప్రాంతాలు తల్లి స్వరం కంటే తెలియని స్వరాలకు ఎక్కువ ప్ర‌తిస్పందిస్తాయ‌ని, కార్య‌చ‌ర‌ణ‌ను ప్రదర్శిస్తాయ‌ని తెలుస్తోంది. అయితే, ఈ మార్పు ఒక‌ర‌కంగా ఆరోగ్యకరమైన పరిపక్వతకు సంకేతమని కూడా పరిశోధకులు తెలిపారు. "ఒక బిడ్డ ఏదో ఒక సమయంలో స్వతంత్రంగా మారతాడు. ఇది అంతర్లీన జీవ సంకేతం ద్వారా అవక్షేపించబడాలి" అని అధ్యయనం సీనియర్ రచయిత వినోద్ మీనన్ అంటారు.

ఇక‌, టీనేజర్లు ప్రపంచంతో మరింత లోతుగా సంబంధం ఏర్ప‌రుచుకోడానికి, ఈ పరివర్తన సహాయపడుతుందని, వారి కుటుంబం బ‌య‌ట‌ సామాజిక నైపుణ్యం సాధించ‌టానికి ఈ మార్పు వారికి తోడ్ప‌డే కనెక్షన్‌లను ఏర్పరచుకోవడంలో వారికి సహాయపడుతుందని మీనన్ వివ‌రించారు. ఈ అధ్యయనం 2016లో నిర్వహించిన పరిశోధన ఆధారంగా రూపొందించబడింది. ఇందులో, పిల్లలు పుట్టకముందే తమ తల్లి వాయిస్‌తో ఎలా సంబంధం కలిగి ఉంటారో కూడా వివ‌రించారు. అలాగే, ఆటిజం, ఇతర మానసిక పరిస్థితులతో ఉన్న వారి కౌమారదశలో మెదడు ఉద్దీపన ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed