అంకితం, ఆవిష్కరణ.. జీవితాంతం పరిశోధనలపైనే అమర్ బోస్ దృష్టి

by Hamsa |   ( Updated:2022-11-29 14:16:34.0  )
అంకితం, ఆవిష్కరణ.. జీవితాంతం పరిశోధనలపైనే అమర్ బోస్ దృష్టి
X

దిశ, ఫీచర్స్: ఇయర్ ఫోన్స్ లేనిదే ప్రయాణాన్ని పూర్తి చేయలేనంతగా మారిపోయింది పరిస్థితి. ఎలాంటి నాయిస్ లేకుండా హ్యాపీగా సినిమా, సాంగ్స్‌ను ఆస్వాదిస్తూ కాలాన్ని గడిపే రోజులొచ్చాయి. కానీ నాయిస్-క్యాన్సలింగ్ హెడ్‌ఫోన్స్‌ను ముందెవరు కనిపెట్టిందెవరో తెలుసా? వేలాది మంది విద్యార్థులు, మిలియన్ల మంది ప్రజల ఫాలోవర్స్‌ను కలిగిన ఆ గురువు, శాస్త్రవేత్త, ఇంజనీర్ అండ్ బిజినెస్‌మన్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? తన జీవితాన్ని ఎన్నో మైలురాళ్లతో నింపేసిన బోస్ కార్పోరేషన్ వ్యవస్థాపకులు 'అమర్ బోస్' ఆ గొప్ప వ్యక్తి కాగా.. అతని సంస్థ అత్యంత ప్రసిద్ధ ఆడియో సామ్రాజ్యాలలో ఒకటిగా రాణిస్తోంది. 'బోస్ ఆఫ్ సౌండ్స్‌'గా పేరొంది జీవితాంతం ఆవిష్కరణ, పరిశోధనలను ప్రోత్సహించాలని కోరుకున్న ఆయన.. 'ఏదైనా అసాధ్యం అని మీరు అనుకుంటే, అది చేస్తున్న వ్యక్తిని డిస్టర్బ్ చేయకండి' అని పిలుపునిచ్చాడు.

బెంగాల్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడికి యూఎస్‌లో జన్మించిన బోస్ ఎలక్ట్రానిక్స్ పట్ల చిన్నప్పటి నుంచే ప్రేమను పెంచుకున్నాడు. 1920లో బ్రిటీష్ వారి ఖైదు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అమెరికాకు పారిపోయిన తర్వాత తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇది ఒక సమగ్ర మార్గంగా మారింది. బాల్యం నుంచే వస్తువులను మరమ్మత్తు చేయడంలో సిద్ధహస్తుడైన బోస్.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తండ్రి ఇంపోర్ట్ బిజినెస్ దెబ్బతినడంతో 13ఏళ్ల వయసులోనే 'రేడియో రిపేర్ సర్వీస్' ద్వారా డబ్బులు సంపాదిస్తూ కుటుంబానికి ఆర్థికంగా మద్దతిచ్చాడు.

కీ సీక్రెట్

మొత్తానికి తండ్రి ఇంపోర్ట్ వస్తువులను సేల్ చేసే అన్ని హార్డ్ వేర్ షాపులతోనూ రేడియో రిపేరింగ్ సర్వీస్ ఒప్పందం కుదుర్చుకున్న బోస్.. చదువులో మంచి గ్రేడ్ ఉన్నా సరే వారానికి నాలుగు రోజులు మాత్రమే స్కూల్‌కు వెళ్లేవాడు. ఈ చిన్న మరమ్మత్తు వ్యాపారం ఫిలడెల్ఫియాలో అతిపెద్ద వ్యాపారాల్లో ఒకటిగా మారింది. కానీ దీంతో ఆగని బోస్.. మరమ్మత్తులో మాస్టరింగ్ తర్వాత రేడియోలు, ఇతర పరికరాలను ఎలా రూపొందించాలో నేర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌ని అభ్యసించడానికి MITలో చేరాడు. ఆ తర్వాత ఎంఐటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన బోస్.. కొత్త స్టీరియో సిస్టమ్‌తో రేడియో రూపొందించాలనుకున్నాడు. అయితే సిస్టమ్ మంచి స్పెసిఫికేషన్‌లతో ఉన్నప్పటికీ పేలవమైన ధ్వని నాణ్యతను కలిగి ఉండటంతో.. 1956లో ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌పై ఇండియాలో బోధిస్తూనే, రాత్రిపూట ధ్వనిశాస్త్రం గురించి చదివాడు. ఈ అనుభవం ధ్వనిశాస్త్రం, సైకోఅకౌస్టిక్స్‌పై జీవితకాల పరిశోధనకు దారితీసింది (ధ్వని ఎలా గ్రహించబడుతుందో అధ్యయనం). అది బోస్ కార్పొరేషన్ ఏర్పాటుకు కారణమైంది. అంతేకాదు 2001 వరకు ఎంఐటీలో బోధనలు చేసిన బోస్.. తన ఇంజినీరింగ్ పాఠాలను 'లైఫ్ 101'గా డబ్బింగ్ చేయడంతో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించాడు.

పరిశోధనకే అంకితం

ఫైనల్‌గా బోధనలో సౌకర్యవంతంగా మారిన బోస్.. తన పరిశోధనను కొనసాగించాడు. అనేక పేటెంట్లను సంపాదించాడు. ఈ సమయంలో కచేరీ హాళ్లలో దాదాపు 80 శాతం ధ్వని పరోక్షంగా ఉంటుందని, అంటే ప్రేక్షకుల చెవులను చేరుకోకముందే గోడలు, పైకప్పులపై నుంచి బౌన్స్ అవుతుందని తెలుసుకున్నాడు. ఈ అభ్యాసం 'ధ్వనిని ప్రతిబింబించే స్పీకర్ సిస్టమ్‌' తయారీ ఆలోచనలకు కారణమైంది. 1964లో ఓ కంపెనీని స్థాపించిన ఆయన.. బోస్ విద్యార్థి, ఈ సంస్థ మొదటి ఉద్యోగితో కలిసి దీనిపై పనిచేయడం మొదలుపెట్టాడు. గోళంలో ఎనిమిదో వంతు ఆకారంలో ఉన్న ప్రొడక్ట్.. గదిలోని ఏ మూలలోనైనా ఉంచబడేలా రూపొందించాడు. సిస్టమ్ వూఫర్‌లను తొలగించి, యాక్టివ్ ఈక్వలైజర్‌ను చేర్చిన ఈ పరికరం.. కచేరీ హాల్ ప్రభావాన్ని పునఃసృష్టించే లక్ష్యంతో ధ్వనిని ప్రతిబింబించేలా శ్రోతలకు బదులుగా గోడలను లక్ష్యంగా చేసుకునే చిన్న లౌడ్ స్పీకర్లను కలిగి ఉంది. అయితే అందరూ దీన్ని ఇష్టపడ్డా.. ఎవరూ కొనుగోలు చేయలేదు. తర్వాత1968లో బోస్ 901 డైరెక్ట్/రిఫ్లెక్టింగ్ స్పీకర్ సిస్టమ్ రిలీజ్ చేయగా.. ఇది 25 సంవత్సరాలకు పైగా బెస్ట్ సెల్లర్‌గా కొనసాగడం విశేషం.

ఇన్నోవేషన్స్ ప్రదర్శన

దీని తరువాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ నాయిస్-క్యాన్సలింగ్ ఇయర్‌ఫోన్స్. యూరోప్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు మొదటిసారిగా విమానంలో హెడ్‌ఫోన్‌లు యూజ్ చేసిన బోస్ చాలా ఎగ్జయిట్ అయ్యాడు. కానీ విమానం నుంచి వచ్చే సౌండ్ హెడ్‌ఫోన్‌ల నుంచి వచ్చే ధ్వని కంటే చాలా ఎక్కువగా ఉండడంతో... వెంటనే పెన్ను, పేపర్ తీసి సమీకరణాలు రాయడం ప్రారంభించాడు. బోస్టన్ చేరుకునే సమయానికి నాయిస్-క్యాన్సలేషన్ ఇయర్‌ఫోన్‌ల ఫార్ములాను సిద్ధం చేశాడు. కానీ కంపెనీ ట్రేడ్‌మార్క్ అయిన QuietComfort నాయిస్-క్యాన్సలేషన్ చేసే హెడ్‌ఫోన్‌లను అభివృద్ధి చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇందుకోసం $50 మిలియన్లకు పైగా ఖర్చు అయింది.

ఆస్ట్రోనట్స్‌కు రక్ష

ఈ నాయిస్-క్యాన్సలేషన్ సిస్టమ్ వ్యోమగాములను శాశ్వత వినికిడి నష్టం నుంచి రక్షిస్తుండగా.. ఈ ఇయర్‌ఫోన్ వర్కవుట్ కావడంతో కార్లకు అనుకూల ఆడియో సిస్టమ్‌లపై పనిచేశాడు బోస్. మొదటిది 1983 కాడిలాక్ సెవిల్లె. కాగా 'ప్రాజెక్ట్ సౌండ్' అనే సీక్రెట్ ప్రాజెక్ట్‌పై 24 సంవత్సరాలు పనిచేసిన ఆయన.. 2004లో సస్పెన్షన్ సిస్టమ్‌ను ఆవిష్కరించాడు. తానెప్పుడూ డబ్బుపై ఆశతో బిజినెస్ చేయలేదన్న బోస్.. 2013లో తన మరణానికి రెండు సంవత్సరాల ముందు బోస్ కార్పొరేషన్ మెజారిటీ స్టాక్‌ను MITకి విరాళంగా ఇచ్చాడు.

READ MORE

Broccoli.. ఏలియన్స్ ట్రాకర్

Advertisement

Next Story

Most Viewed