- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
UPI- క్రెడిట్ కార్డ్ లింకింగ్.. బెనిఫిట్స్ ఏంటి?
దిశ, ఫీచర్స్ : డీమానిటైజేషన్ తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి.వినియోగదారులు సైతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) పేమెంట్లకే ప్రాధాన్యతనిస్తున్నారు. కస్టమర్ల డెబిట్ కార్డ్స్‌ను బ్యాంక్ ఖాతాలతో లింక్ చేయడం ద్వారా ఈ లావాదేవీలు జరుగుతుండగా.. యూపీఐతో క్రెడిట్ కార్డ్ లింకేజ్‌కు మాత్రం ఆర్బీఐ ఇప్పటివరకు అనుమతించలేదు. అయితే రీసెంట్‌గా కస్టమర్లకు ఈ వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ప్రస్తుతానికి యూపీఐతో అన్ని రూపే క్రెడిట్ కార్డ్‌లు లింక్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్(PoS) మెషిన్ అవసరం లేకుండా QR కోడ్ స్కానింగ్‌తో క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయాన్ని నిపుణులు స్వాగతిస్తుండగా.. కస్టమర్లకు, వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు?
ప్రస్తుతం రెండు రకాల 'వ్యవస్థీకృత(Organised), అసంఘటిత(Unorganised)' వ్యాపారులు ఉన్నారు. వ్యవస్థీకృత వ్యాపారులు కార్డ్, యూపీఐ చెల్లింపులను ఆమోదించే (ShoppersStop) వంటివారు. ఇక యూపీఐ చెల్లింపులను P2P (వ్యక్తి నుండి వ్యక్తికి)గా అంగీకరించే అసంఘటిత వ్యాపారులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి యూపీఐ చెల్లింపులను అంగీకరించడం ఉచితం. ఇకపై క్రెడిట్ కార్డ్ నుంచి కూడా చెల్లింపులను అంగీకరించగలరని, ఫిన్‌టెక్ స్టార్టప్ Uni వ్యవస్థాపకుడు CEO నితిన్ గుప్తా వివరించారు.
రూపే కార్డులకు మంచి ప్రారంభం కానుందా?
ప్రస్తుతం రూపే కార్డ్స్‌కు మాత్రమే యూపీఐ లింకింగ్ పర్మిషన్ లభించింది. కానీ ఈ సదుపాయం త్వరలో వీసా, మాస్టర్ కార్డ్‌లకు కూడా అందుబాటులోకి వస్తుంది. నిజానికి చాలా మంది వ్యాపారులకు క్రెడిట్ కార్డ్ PoS టెర్మినల్స్ లేవు. ముఖ్యంగా సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో UPI QR కోడ్ ఆధారిత పేమెంట్స్ ఎక్కువ చెలామణిలో ఉన్నందున క్రెడిట్ కార్డ్ లింకేజ్‌కు ఆమోదయోగ్యత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రివార్డ్ ప్రయోజనాల కోసం క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించాలనుకునే కస్టమర్లకు ఇది సాయం చేస్తుంది. ఈ అనుసంధానం 'డిజిటల్ ఇండియా' భావనను పెంపొందిస్తుందని, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని పెంచుతుందని లెండింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సర్వత్రా టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, MD మందర్ అగాషే అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఫిజికల్ కార్డ్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదని, కార్డు డేటా కూడా సురక్షితంగా ఉంటుందని తెలిపారు.
'యూపీఐతో క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయడం ఒక వినూత్న, వ్యూహాత్మక చర్య. ఇది డిజిటల్ ఇండియా అంతిమ మిషన్‌ను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లించాలనుకునే వినియోగదారు దానిని UPI ద్వారా చేయవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ బ్యాక్-ఎండ్ పరికరం. ఇది డిజిటల్ లావాదేవీలను వేగవంతం చేయడమే కాకుండా లావాదేవీల సగటు టికెట్ పరిమాణంపైనా ఇది ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ప్రతి లావాదేవీకి సగటు టికెట్ పరిమాణం రూ. 1,600 ఉండగా క్రెడిట్ కార్డ్ లావాదేవీ దాదాపు రూ. 4,000. కాబట్టి ఈ అభివృద్ధితో ప్రస్తుత యూపీఐ టికెట్ పరిమాణం దాదాపు రూ. 3,000- 4,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
ఆర్బీఐ ప్రకారం.. మే 2022లో యూపీఐ ద్వారా దాదాపు రూ. 10.4 లక్షల కోట్ల విలువైన 594 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు UPI ప్లాట్‌ఫామ్‌తో రూపే క్రెడిట్ కార్డ్‌ల లింకింగ్ అదనంగా 15-20% వృద్ధిని జోడిస్తుందని ఆశిస్తున్నారు. అయితే చెల్లింపుల రంగంలో ఉన్న పేమెంట్ గేట్‌వే, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) నేతృత్వంలోని వ్యాపార నమూనాలకు ఇది మరింత అంతరాయం కలిగిస్తుందని గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్సల్టింగ్ హెడ్ జైకృష్ణన్ జి అన్నారు. ఇదిలా ఉంటే.. దేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని ఇది వేగవంతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఫోన్‌పే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(BCG) కొత్త నివేదిక ప్రకారం 2026 నాటికి డిజిటల్ చెల్లింపుల విలువ ఇప్పుడున్న $3 ట్రిలియన్ నుంచి $10 ట్రిలియన్లకు మూడు రెట్లు పెరుగుతుందని, మొత్తం చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపులే దాదాపు 65% ఉంటాయని అన్నారు. ఈ లెక్కన 2026 నాటికి ప్రతి మూడు చెల్లింపు లావాదేవీల్లో రెండు నగదు రహిత లేదా డిజిటల్‌గా ఉండనున్నాయి.
MDRపై సమాధానం లేని ప్రశ్నలు
క్రెడిట్ కార్డ్ యూపీఐ లింకింగ్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, మర్చంట్ డిస్కౌంట్ రేట్ల(MDR)పై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న UPI వ్యాపారులకు ఎలాంటి ఛార్జీ విధించబడదు. కానీ క్రెడిట్ కార్డ్‌ల విషయంలో MDR ఛార్జీలు వర్తిస్తాయి. అంటే ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీకి, వ్యాపారులు బ్యాంకులకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు వ్యాపారులు ఒప్పుకుంటారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై ఆర్బీఐ గవర్నర్ రవిశంకర్‌ను అడిగితే.. 'చార్జీలు ఏ మేరకు విధిస్తే వర్కవుట్ అవుతాయో మున్ముందు డిసైడ్ చేస్తాం' అంటూ దాటవేశారు.
మరిన్ని ఉపయోగాలు :
* యూపీఐ పేమెంట్ కోసం కస్టమర్లకు మరొక ఆప్షన్ లభిస్తుంది.
* ఇప్పటి వరకు ఖాతాలోని నగదునే యూపీఐ ద్వారా చెల్లించే వీలుండేది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లింకింగ్‌తో ఆ కార్డు లిమిట్ యూపీఐ పేమెంట్ కోసం ఉపయోగపడుతుంది.
* క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే తిరిగి కార్డు బిల్ చెల్లించేందుకు 45-51 రోజుల సమయం లభిస్తుంది. ఇది యూపీఐ పేమెంట్‌లోనూ వర్తిస్తుంది.
* యూపీఐతో అనుసంధానించడం వల్ల దేశంలో డిజిటల్ పేమెంట్స్ మరింత విస్తృతమవుతాయి
* రూపే క్రెడిట్ కార్డు-యూపీఐ అనుసంధానం వల్ల ఇతర రంగాల్లో కూడా యూపీఐ చెల్లింపులు పెరుగుతాయి.
మరిన్ని వార్తలు: డేంజరస్ సెక్స్ ట్రెండ్
మధ్యాహ్నం 2 గంటలకే చీకటి.. దేవుడు లేకుండా గుడి.. తెలంగాణలో వింత గ్రామం