Bad attitudes : ఓటమికి దారితీస్తున్న చెడు వైఖరులు.. ఎలా ప్రభావితం చేస్తాయంటే..

by Javid Pasha |   ( Updated:2024-08-16 12:45:24.0  )
Bad attitudes : ఓటమికి దారితీస్తున్న చెడు వైఖరులు.. ఎలా ప్రభావితం చేస్తాయంటే..
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషంగా ఉంటున్నారా?.. బాధలో కూరుకుపోయారా?.. సమస్యలు ఎదురైనప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీరెలా రెస్పాండ్ అవుతున్నారు? ఇవన్నీ ఆయా సందర్భాల్లో మీరు తీసుకునే వైఖరిని బట్టి కూడా ఆధారపడి ఉంటాయంటున్నారు నిపుణులు. సాధారణంగా సమాజంలో ప్రతీ ఒక్కరికి ఏదో ఒక వైఖరి ఉంటుంది. అదెలా ఉంటుందనే దానిని బట్టి వ్యక్తులు కూడా ప్రభావితం అవుతుంటారు. ముఖ్యంగా అనాలోచిత లేదా చెడు వైఖరి నష్టం కలిగిస్తుందని, ఓటమికి దారితీస్తుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిపుణుల ప్రకారం ఎలాంటి వైఖరులు మనకు నష్టం కలిగిస్తాయో, ఓటమికి దారి తీస్తాయో ఇప్పుడు చూద్దాం.

భిన్న వైఖరులు

ముఖ్యమైన సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీ వైఖరులను వెల్లడిస్తాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. కాగా ఇవి అందరిలో ఒకే విధంగానో, ఒకే వ్యక్తిలో ఎల్లప్పుడూ ఒకే విధంగానో ఉండవు. జీవితమన్నాక మంచీ చెడూ జరుగుతుంటాయి. ప్రతీ వ్యక్తిలో ఏదో ఒక ప్లస్, అలాగే మైనస్ ఉంటాయి. అదే సందర్భంలో వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, ఆయా అంశాలపట్ల ఏ ఇద్దరు వ్యక్తుల ఓపీనియన్స్ ఒకేలా ఉండకపోవచ్చు. అంటే భిన్న వైఖరులు కామన్. కానీ కొందరు ఈ పరిస్థితిని అర్థం చేసుకోరు. వాస్తవానికి భిన్నంగా కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తుంటారు. తమలోని మిస్టేక్స్‌ను కప్పిపుచ్చుకొని ఇతరుల్లో మాత్రమే వాటిని వెతుకుతుంటారు. అలాంటి కొన్ని చెడు వైఖరులు, సరిదిద్దుకోవాల్సిన అంశాలేవో వివరిస్తున్న నిపుణులు వాటిని సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.

ఇతరులతో పోలిక, అవమానించడం

కొందరు ప్రతీ విషయంలో ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తిలాగా తాము లేనందుకు బాధపడటమో లేదా తమలాగా ఎదుటి వ్యక్తులు నడుచుకోవడం లేదని అవమానించడమో, చులకన చేయడమో చేస్తుంటారు. దీనినే నిపుణులు చెడు వైఖరిగా పేర్కొంటున్నారు. ఈ బ్యాడ్ ఆటిట్యూడ్ వల్ల నిజానికి నష్టపోయేది అలాంటి వైఖరి కలిగినవారే. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు, ఆలోచనలు, పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. అలాంటప్పుడు ఎవరి పరిధిలో వారు తమ వైపు ఆలోచించడంతోపాటు ఇతరుల మేలు కోరి కూడా నడుచుకోవాలి. కానీ చెడు వైఖరి ఉన్నవారు ఇలా చేయరు. తమ గురించిన ఆలోచనలు మానుకొని కేవలం ఇతరుల లోపాలు వెతకడానికే ఫోకస్ చేస్తారు. ఇతరులకు మంచి జరగడాన్ని చూసి లోలోన అసూయ పడుతుంటారు. ఇతరుల సక్సెస్‌ను అంగీకరించడమో, అభినందించడమో కాకుండా తక్కువచేసి చూస్తుంటారు. ఇది సరైంది కాదని, మార్చోవాల్సిన వైఖరి అని నిపుణులు పేర్కొంటున్నారు.

తప్పును అంగీకరించకపోవడం

తప్పు చేస్తారు. అది వారి మనసుకూ తెలుసు. కానీ ఓ పట్టాన అంగీకరించరు. కనీసం సారీ కూడా చెప్పే ప్రయత్నం చేయరు. వ్యక్తిల్లోని చెడు వైఖరుల్లో ఇదొకటని నిపుణులు పేర్కొంటున్నారు. తమలో లోపం ఉన్నప్పటికీ తామే సరైన వాళ్లమనే భావనతో ఉంటారు. చేయని తప్పుకు ఎవరూ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ లోపం, తప్పు మీలో ఉన్నప్పుడు కూడా అలా చేయకపోవడం లేదా అంగీకరించకపోవడం చెడు వైఖరికి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మీలో ఉంటే మార్చుకోవాలంటున్నారు నిపుణులు. నిజానికి తప్పును అంగీకరించడానికి కూడా గుండె ధైర్యం కావాలి. మీరు చేసింది కరెక్ట్ కానప్పుడు సారీ చెప్పడానికి, అంగీకరించడానికి వెనుకాడవద్దు. పైగా గర్వ పడాలంటున్నారు నిపుణులు.

ఏం చేసినా పోటీగానే అనుకుంటారు

మంచి వైఖరి కలిగి ఉన్నప్పుడు ఇతరులను అర్థం చేసుకునే తీరు భిన్నంగా ఉంటుంది. కానీ చెడు వైఖరి కలిగినవారు మాత్రం అన్ని విషయాల్లోనూ ఇతరులను, ముఖ్యంగా తమ చుట్టు పక్కల వ్యక్తులను శత్రవులుగా చూస్తుంటారు. మీరూ అదే చేస్తుంటే గనుక కచ్చితంగా అది బ్యాడ్ ఆటిట్యూడ్ అంటున్నారు నిపుణులు. ఈ వైఖరి కలిగిన వ్యక్తులు తాము చేసే మంచి పనుల గురించి ఇతరులకు చెప్తే.. వారు తమకు పోటీగా వస్తారేమోననే భయంతో ఉంటారు. తాము పొందిన ప్రయోజనాన్ని ఇతరులు పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు భ్రమ పడతారు. తాము ఏం చేశామో సంబంధం లేకుండా తమకు తెలిసిన వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ.. వారు తమ పని తాము చేసుకుంటూ పోతున్నా.. దానిని తమకు పోటీగా ఊహించుకుంటారు. చివరికి ఈ వైఖరి అనర్థాలకు దారితీస్తుంది.

గౌరవించరు.. కానీ ఆశిస్తారు

పలువురి వైఖరి ఎలా ఉంటుందంటే.. సొసైటీలో తాము గౌరవంగా ఉండాలనుకుంటారు. ఇతరుల ద్వారా గౌరవించబడాలని ఆశిస్తుంటారు. ఇలా అనుకోవడంలో తప్పులేదు కానీ.. వారు మాత్రం ఇతరులకు గౌరవం ఇవ్వరు. ఒకవేళ గౌరవించాలనుకుంటే ఇక్కడ కూడా స్వార్థంగా ఆలోచిస్తారు. అవతలి వ్యక్తి హోదాను, సోషల్ స్టేటస్‌ను, ఆస్తిని బట్టి గౌరవిస్తుంటారు. ఇది అత్యంత చెడు వైఖరి. కాబట్టి నిస్వార్థంగా ఇతరులను గౌరవించడం మంచి వైఖరికి నిదర్శనం. మిమ్మల్ని మీరు అలా మంచి వైఖరి కలిగిన వ్యక్తులుగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు.

బాధాకరమైన ఆలోచనలు..

సమాజంలో అందరికీ బాధలు, కష్టాలు ఉంటాయి. అలాగనీ అవేం స్థిరంగా ఉండిపోవు. కానీ కొందరు ఒకసారి ఎదురైన చేదు లేదా చెడు అనుభవాన్ని మనసులో పెట్టుకొని, అదే తల్చుకుంటూ బాధపడుతుంటారు. ఎదుటి వ్యక్తులతో, స్నేహితులతో ప్రతీ సందర్భంలో వాటినే పంచుకుంటూ ఉంటారు. దీనివల్ల బాధితుల్లో క్రమంగా ప్రతికూల మానసిక స్థితి ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అదీకాక తరచుగా బాధలనే ఏకరువు పెట్టేవారితో ఇతరులు సన్నిహితంగా, స్నేహంగా ఉండే అవకాశం తక్కువ. కాబట్టి అలాంటి వైఖరి మీలో ఉంటే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed