Alcohol effects : ఆల్కహాల్ అధికంగా సేవిస్తే అకాల మరణం.. రక్తంలో టాక్సిక్ మెటల్స్ పెరగడమే కారణం!

by Javid Pasha |   ( Updated:2024-10-10 13:29:57.0  )
Alcohol effects  : ఆల్కహాల్ అధికంగా సేవిస్తే అకాల మరణం.. రక్తంలో టాక్సిక్ మెటల్స్ పెరగడమే కారణం!
X

దిశ, ఫీచర్స్ : ఆల్కహాల్, గంజాయి, పొగాకు వంటి మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే అవి బాధితుల రక్తంలో, యూరిన్‌లో విష పదార్థాల అభివృద్ధికి కారణమై అకాల మరణానికి కూడా దారితీస్తాయని కొలంబియాలోని మెయిల్ మన్ స్కూల్ ఆఫ్ హెల్త్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘకాలంపాటు మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉన్నవారిలో ఆయుఃప్రమాణం తగ్గుతున్నట్లు వారు గుర్తించారు.

ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉపయోగించే మత్తు పదార్థాల్లో పొగాకు, ఆల్కహాల్, గంజాయి వంటివి ప్రధానంగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఆరోగ్యంపై వీటి ప్రభావాన్ని తెలుసుకునేందుకు వారు 2018 నుంచి 2005 మధ్య కాలంనాటి కొలంబియన్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే డేటాను ఎనలైజ్ చేశారు. అలాగే 2023 నాటి ఒక అధ్యయనాన్ని కూడా విశ్లేషించారు. కాగా మొత్తం 7,354 మంది గంజాయి, ఆల్కహాల్, పొగాకు అలవాట్లు కలిగిన వారిని, ఎటువంటి అలవాట్లు లేనివారిని పోల్చి చూశారు. అయితే వీరిలో పొగాకు, ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకునే వారి రక్తంలో, యూరిన్‌లో మాత్రమే నికోటిన్, కాడ్మియం, సీసం వంటి టాక్సిక్ మెటల్స్‌తోపాటు ఇతర విష పదార్థాలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ బాధితుల్లో కాలేయ వైఫల్యం, గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక వ్యాధులు వంటి అనారోగ్యాలకు దారితీస్తాయని, వారి జీవిత కాలాన్ని తగ్గించడం ద్వారా అకాల మరణాలకు కారణం అవుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story