- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ahobilam : అడ్వెంచర్ కమ్ ఆధ్యాత్మికం.. అహోబిలం ట్రెక్
అడ్వెంచర్ కమ్ ఆధ్యాత్మికం అహోబిలం (Ahobilam) ట్రెక్. గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ (GTK) వారి అహోబిలం బ్రోచర్ చూడగానే ఆలోచనలో పడ్డాను. అహోబిలం రెండుమూడు పర్యాయాలు వెళ్ళాను. కానీ దట్టమైన నలమల పశ్చిమ కనుమల అందాలు ఎప్పుడూ చూడలేదు. వెళ్లాలనే ఉత్సాహం నానాటికీ పెరిగిపోయింది. ఉగ్రస్తంభం ఊరిస్తూ ఉన్నది. యూట్యూబ్ (Youtube) వీడియోలు భయపెడుతూ ఉన్నాయి. ఎలాగైనా వెళ్ళాల్సిందే... అనే పట్టుదల పెరిగింది. GTK వాళ్ళతో తర్జనభర్జనల పిమ్మట ప్రయాణానికి సిద్ధమయ్యాను.
HTC, YHAI లాగా GTK అనేది పెద్ద సంస్థ ఏమీ కాదు. ఆ ప్రాంతంలోని కొందరు యువకుల చొరవతో రెండేళ్ళ క్రితం ట్రెక్కింగ్ బృందంగా ఏర్పడింది. వారాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు పరిసర ప్రాంతాలలోని విద్యార్థులకు ట్రైక్కులు నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన యువతను దేశ భవిష్యత్తుకు అందిస్తుంది GTK. పబ్ కల్చరుకు అలవాటు పడుతున్న నేటి కాలంలో ఇలాంటివి చాలా అవసరం. విభిన్నమైన సామాజిక సేవగా దీనిని గుర్తించాలి.
అహోబిలం నృసింహ క్షేత్రం చాలా ప్రసిద్ధమైంది. అయితే ఆ ప్రాంతంలో దట్టమైన అడవిలో దాగివున్న స్వయం భూ నవ నరసింహ క్షేత్రాలు అంత ప్రచారానికి నోచుకోలేదు. కారణం దుర్గమమైన ప్రదేశంలో ఉండడం కావచ్చు. తెలుగు రాష్ట్రాలలో వివిధ జిల్లాలలోని ప్రసిద్ధి పొందిన నవ నరసింహ క్షేత్రాలు వేరు. హైదరాబాదు నుంచి నలుగురం బస్‌లో నంద్యాల వెళ్ళాము. గుంటూరు, విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాలనుంచి మిగతావారు కూడా నంద్యాలకు వచ్చారు. మొత్తం 32 మంది బృందం. ఉదయం ఆరు గంటలకు మూడు తుఫాను వ్యాన్లలో ముందుగా మహానందికి వెళ్లాము. స్నానాలు, దర్శనాలు, ఉపాహారం తరువాత ఆళ్లగడ్డ మీదుగా దిగువ అహోబిలం చేరుకున్నాము. గంటన్నర ప్రయాణం. సుమారు 80కిలోమీటర్ల దూరం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీశాఖ వారి అనుమతి పొందిన జీపులలో మాత్రమే అడవి లోపలికి ప్రయాణించవలసి ఉంటుంది. ఒక్కరికి ₹500/ చెల్లించాలి. ఐదు వాహనాలలో మా ప్రయాణం మొదలైంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముందే లోనికి వెళ్ళవలసి ఉంటుంది. శని, ఆదివారాల్లో ఈ వేళల్లో వెసులుబాటు ఉంటుంది. అటవీశాఖ చెక్ పోస్టు నుంచి 25 కిలోమీటర్లు దట్టమైన అడవిలోకి ప్రయాణం. ఉమ్మడి రాష్ట్రానికి గవర్నరుగా ఉన్న నరసింహన్ హయాంలో కొంత దూరం ఒక మోస్తరు రోడ్డు ఏర్పడిందని స్థానికులు చెప్పారు. కానీ వర్షాల కారణంగానేమో మేము వెళ్ళినప్పుడు అది కూడా సరిగ్గా లేదు. పైపెచ్చు రాళ్ళతో కూడుకున్న భయంకరమైన మార్గం. ఆ కుదుపులు తెల్లవారి మేము చేయబోయే కఠినమైన ట్రెక్కుకు వామ్అప్ వ్యాయామంగా సరిపెట్టుకున్నాము. పాజిటివ్ ఆలోచనా విధానం అన్ని వేళలా మంచిది కదా...
చీకటి కొండల్లో అద్భుత దృశ్యం
అలా మేము తొమ్మిదిలో ఒకటైన పావన నరసింహ క్షేత్రానికి చేరుకున్నాము. హిరణ్యకశిపుడి వధానంతరం నరసింహస్వామి చెంచు లక్ష్మిని వివాహమాడి అక్కడ వెలిశాడని చెపుతారు. అక్కడ నుంచి తిరిగి అదే దారిలో చెక్ పోస్ట్ చేరుకుని మరో మార్గంలో మూడు కిలో మీటర్లు అడవిలో ప్రయాణిస్తే భార్గవ నృసింహ క్షేత్రం వస్తుంది. నరసింహ స్వామి ఇక్కడే భార్గవ రాముడికి దర్శనమిచ్చాడట. ఈ రెండు గుళ్ళు చిన్నవే కానీ దట్టమైన అడవిలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళడమే ఒక అద్భుతమైన అనుభూతి. తిరుగు దారిలో భోజనం ముగించుకొని ఎగువ అహోబిలంలోని గదులలోకి చేరేసరికి సాయంత్రం ఏడున్నర అయింది. కాసేపు విశ్రాంతి తీసుకొని మేము ఉన్న పక్క భవనం టెర్రస్ పైకి ఎక్కి చూస్తే..... ఆ చీకట్లో కొండలు అడవులతో కూడిన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇప్పటికీ నా మనోఫలకంలో చిత్రించుకున్న ఆ అందాన్ని వర్ణించడానికి భాష చాలదు. ఇలాంటివే మనకు అరుదుగా దొరికే అనుభూతులు.
ఈ ట్రెక్కింగ్ సాహస కృత్యమే!
ఉదయం ఏడుగంటలకల్లా అల్పాహారం ముగించుకొని ఉగ్రస్తంభం ట్రెక్ మొదలు పెట్టాము. అఖిల్ అనే స్థానిక కుర్రాడు గైడ్‌గా వచ్చాడు. మేము బస చేసిన చోటు నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. మార్గమధ్యలో ఊత కర్రలు తీసుకొని నడక ప్రారంభించాము. ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి. మా బృందంలో ఇద్దరం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళం. ముగ్గురు యాబై ఏళ్ళ వాళ్ళు. మిగతావాళ్ళు ముప్పై ఐదేళ్ళ లోపు వాళ్ళు. ఒక పదేళ్ళ బాబు. రెండు మూడు వంతెనలు, కొంత కచ్చా దారి, నాలుగువందల మెట్లు. ఇక్కడి వరకు చాలామంది వెళతారు. డోలీ సౌకర్యం కూడా ఉన్నది. ఒక్కరికి ₹ 4000/ లు తీసుకుంటారు. జ్వాలా నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఇంకొంచెం ముందునుంచి ఉగ్రస్తంభానికి దారి. అక్కడ మొదలవుతుంది అసలు ట్రెక్. అక్కడినుంచి సుమారు నాలుగైదు వందల అడుగుల స్తంభం లాగా నిటారుగా ఉన్న రాతి కొండను ఎక్కి, అక్కడనుంచి అంతే నిటారుగా కిందకు దిగితే నరసింహ స్వామి స్వయం భూ పాదాలుంటాయి. పక్కనే ప్రతిష్ఠించిన పాదద్వయం కూడా ఉన్నది. హిరణ్యకశపుడి కోరిక మేరకు ఆ రాతి స్తంభం నుంచే నరసింహ స్వామి ఉద్భవించినట్లు చెపుతారు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ స్తంభం లాంటి కొండను ఎక్కడం మాత్రం సాహస కృత్యమే.... అక్కడక్కడా ఎక్కే వాళ్ళకు సపోర్టు కోసం ఎప్పుడో కట్టిన తాళ్ళు ఉన్నాయి. వాటి మీద పూర్తిగా ఆధార పడలేము. మరికొన్ని చోట్ల మహా వృక్షాల వేర్లు ట్రెక్కర్స్ కు ఆధారమవుతాయి. ఇంకొంత దూరం కోసదేరిన బండరాళ్ళను పట్టుకొని ఎక్కవచ్చు. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా జారి కింద పడడం ఖాయం.
ఉగ్రస్తంభం కాదు, ఉత్సాహ స్తంభం
ఎలాగో కష్టపడి పైకి చేరుకున్నాక మరొక ఉపద్రవం. రెండు వైపులా లోయతో, ఎలాంటి సపోర్టు లేకుండా దాదాపు రెండున్నర అడుగుల వెడల్పుతో ఇరవై అడుగుల దూరం ప్రాణాలు ఉగ్గ పట్టుకొని చాలా జాగరూకతతో వెళ్ళాలి. హమ్మయ్య గమ్యం చేరుకున్నాం అనుకునే లోపల సుమారు అర ఫర్లాంగ్ ఆ స్తంభపు కొండను కిందకు దిగాల్సి ఉంటుంది. అదీ గమ్యస్థానం. నృసింహడి పాద ద్వయం ఉన్నచోటు అన్నమాట. అక్కడ కూడా ఎలాంటి సపోర్టు లేదు. ముగ్గురు, నలుగురు మించి అక్కడ ఉండడానికి చోటు లేదు. ఉత్కంఠతో గమ్యం చేరాక ఆ ప్రకృతి రామణీయకత, స్వచ్ఛమైన చల్లని గాలి, కనుచూపు మేరా హరిత వర్ణం, కొండల వెనుక కొండల వరుసలు గొప్ప చిత్రకారుడు గీసిన ప్రకృతి చిత్రాన్ని చూసి మన భయం, అలసట మర్చిపోయిన వేళ అది ఉగ్రస్తంభం కాదు, ఉత్సాహ స్తంభం అనిపించింది. ఎక్కేటపుడు దిగేటప్పుడు కూడా కొన్ని సార్లు చేతులు కూడా వాడ వలసి వచ్చింది. అంటే కోతి లాగా నాలుగు కాళ్ళమీద పాకడం అన్నమాట. అలసట అనిపించినప్పుడు ఖర్జూరం లాంటి తక్షణ శక్తినిచ్చేవి కోతి కంట్లో పడకుండా నోట్లో వేసుకోవడం కూడా ఇబ్బందే అయింది. ఇలాంటి ప్రమాదకరమైన ట్రెక్స్ చేస్తున్నప్పుడు మానవత్వం వికసించి పరిమళిస్తుంది. తమ, పరాయి అనే భేదం లేకుండా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. ఈ ట్రెక్ లో అలా నాకు పరిచయమైన అమ్మాయి సలీల. సలీల అంటే నది అని అర్థం. నదిలోగా గలగలా మాట్లాడుతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చింది. చీరతో ఉగ్రస్తంభం ఎక్కాలని ఛాలెంజ్ తీసుకుందట. మొత్తానికి సాధించింది.
మాలోలుడు... మహాలక్ష్మీ లోలుడు
ఉగ్రస్తంభం నుంచి కిందకు దిగి, కుడివైపుగా సుమారు యాబై మెట్లెక్కి, కొండలపైనుంచి పడుతున్న జలధారల కిందనుంచి జ్వాలా నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నాము. ఈ దారిలో రక్తగుండం ఉంది. కోప జ్వాలలతో హిరణ్యకశిపుడిని వధించిన తరువాత ఆ గుండంలో చేయి కడిగాడని, అందుకే నీళ్ళు ఎర్రగా ఉన్నాయని, అక్కడ ఉద్భవించిన నరసింహ స్వామికి జ్వాలా నరసింహస్వామి అని పేరు వచ్చిందని పూజారి చెప్పాడు. అక్కడనుంచి వరాహ నృసింహ స్వామి ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ విగ్రహం వరాహ ముఖంతో భిన్నాభిముఖంగా ఉంది. ఎదురుగుండా ఉన్న చిన్న జలాశయంలో ప్రకృతి సిద్ధమైన ఫిష్ పెడిక్యూర్ అనుభవం మరువ లేనిది. వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లలో చేయించుకునే ఫిష్ పెడిక్యూర్ ఇక్కడ సహజంగానే జరిగిపోయింది. దాంతో పాదాల అలసట కూడా కొంత ఉపశమించింది. అక్కడ నుంచి మాలోల నృసింహ క్షేత్రానికి పోయాము. స్వామి చెంచు లక్ష్మిని పెళ్లి చేసుకున్నందుకు మహాలక్మి అలిగిందని.... మా అంటే మహా లక్ష్మి అని అర్థం. లోలుడు వశం కావడం అని అర్థం. మహాలక్ష్మికి వశమై అక్కడ ఉద్భరించాడని, మాలోల నరసింహస్వామి అంటారని స్థలపురాణం.
బిలంలో కొలువుదీరిన అహోబిలం
ప్రధాన క్షేత్రమైన అహోబిలం ఉగ్ర నరసింహ ఆలయానికి వెళ్ళాము. ఇది ప్రహ్లాదుడికి దర్శనమిచ్చిన చోటు. బిలం అంటే రంధ్రం. ఒక బిలంలో ఉంది కనుక అహోబిలం అయింది. పెద్ద దేవాలయం. అద్భుతమైన శిల్పకళ ఉన్నది. పక్కనుంచి పైకి ఎక్కి వెళితే ఆ ప్రకృతి సౌందర్యానికి మైమరచి పోతాం. భోజనాలు ముగించి తిరిగి ప్రయాణమయ్యాము. దిగువ అహోబిలంలో ముందు రోజు దర్శించ లేకపోయిన మూడు ఆలయాలను చూసాము. అందులో ఒకటి కారెంజ నృసింహ ఆలయం. ఆంజనేయునికి శ్రీరామునిగా దర్శనమిచ్చిన బోటు. తరువాత ఛత్రవట నృసింహ క్షేత్రం. ఆహా, ఓహో అనే గంధర్వులు గానం చేస్తూ నృత్యం చేయగా దానికి మెచ్చి దర్శన మిచ్చిన ప్రదేశం. యోగానంద నృసింహ క్షేత్రం. ప్రహ్లాదునికి యోగ విద్య, యుద్ధ విద్యలను స్వయంగా నరసింహ స్వామి చెప్పిన చోటుగా ప్రసిద్ధి. దిగువ అహోబిలంలో ప్రత్యేకమైంది లక్ష్మీ నృసింహాలయం. పక్కనే నవ నరసింహులను ప్రతిష్ఠించిన చిన్న ఆలయం ఉన్నది. అడవిలోపలికి వెళ్లి అందరికీ చూసే వీలు ఉండక పోవచ్చు. అందుకే ఈ ఏర్పాటు చేసి ఉంటారు.
నవ నరసింహులే నవగ్రహాధిపతులు
నవ నరసింహులను నవ గ్రహాలకు అధిపతులుగా చెపుతారు. జ్వాలా - కుజుడు, అహోబిల - గురువు, మలోల - శుక్రుడు, వరాహ - రాహు, కరంజ - చంద్రుడు, భార్గవ - సూర్యుడు, యోగానంద - శని, ఛత్రవట - కేతు, పావన - బుధ అని నవ నారసింహులను నవగ్రహాలకు అధిపతులుగా చెపుతారు. ఈ దర్శనం వలన ఆయా గ్రహాల చెడు ప్రభావాలు నశిస్తాయని జనం నమ్మకం. దిగువ అహోబిలంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది లక్ష్మీనృసింహాలయం. స్వయంగా వెంకటేశ్వరస్వామి ప్రతిష్ఠించినట్లు పురాణ కథ. అద్భుతమైన శిల్పకళలో విరాజిల్లుతున్నది. తురుష్కుల దండయాత్రలలో ధ్వంసమైన భాగాలను తరువాతి రాజులు పునరుద్ధరించినట్లు చరిత్ర చెపుతున్నది. చారిత్రక దేవాలయాలు చాలా చోట్ల ముస్లిం రాజుల దండయాత్రల వలన ధ్వంసం అయినవే కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం శిల్పకళ చెక్కుచెదరకుండా ఉన్నది. నన్ను ఆశ్చర్య పరిచింది. ఒక పురాతన దేవాలయాన్ని అలా చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏనుగు వీరాస్వామి రచించిన కాశీయాత్ర చరిత్రలో అహోబలం ఆలయాలకు సంబంధించిన వివరాలు లభిస్తాయి.
అడ్వెంచర్, ఆధ్యాత్మికత, శిల్పకళ, ప్రకృతి సౌందర్యం వీటి కలబోతే మా అహోబిలం ప్రయాణం ప్రత్యేకత. రెండు రోజుల టూర్ లో అనుభవాలను అనుభూతులను సొంతం చేసుకుని ఆనందంగా తిరిగి వచ్చాను.
- గిరిజ పైడిమర్రి, ట్రావెలర్
ఫోన్ : 99494 43414