Grey Divorce : 50-60లలో విడాకులు తీసుకుంటున్న జంటలు..అసలు చిక్కు చట్టానికే..

by Sujitha Rachapalli |
Grey Divorce : 50-60లలో విడాకులు తీసుకుంటున్న జంటలు..అసలు చిక్కు చట్టానికే..
X

దిశ, ఫీచర్స్:

గ్రే డివోర్స్... 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలకడం. ఇంతకుముందు అరుదుగా కనిపించే ఈ తరహా విడాకులు ఇప్పుడు సాధారణం అయిపోతున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల ఎఫెక్ట్ తో భారతదేశంలోనూ క్రమంగా పెరిగిపోతున్నాయి. నిజానికి ఇండియాలో వివాహం అనేది జీవితకాల బంధంగా పరిగణించబడేది. కుటుంబం ఒత్తిడి, సమాజం ఎలా చూస్తుందోననే భయంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు భయపడేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఇలాంటి సొసైటల్ ఫీలింగ్స్ ను లైట్ తీసుకుంటున్న జనాలు.. ఒంటరిగా హాయిగా జీవించేందుకు మొగ్గుచూపుతున్నారు. జీవిత చరమాంకంలో సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత ప్రాధాన్యత ఇందుకు దారితీస్తుందని అంటున్నారు నిపుణులు.

గ్రే విడాకులలో ఒక ముఖ్యమైన అంశం స్త్రీలలో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యం. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లోకి ఎంటర్ కావడం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించడం, ఆర్థిక భద్రత కోసం తమ జీవిత భాగస్వాములపై ఆధారపడక పోవడం ఈ నిర్ణయానికి కారణం కావచ్చు. వైవాహిక జీవితం కన్నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకునే ధైర్యం వస్తుందని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.

అంతేకాదు 50, 60 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు తమపై ఆధారపడిన పిల్లల బాధ్యతలు అప్పటికే నిర్వర్తించి ఉంటారు. మరికొద్ది కాలం మాత్రమే మిగిలిన భవిష్యత్తును ఎలాంటి రెస్పాన్సిబిలిటీ, స్ట్రెస్ లేకుండా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నారు. విడాకులతోనే ఇదంతా సాధ్యం అవుతుందనే అభిప్రాయంతో అంటున్నారు. సాంస్కృతిక మార్పు కూడా ఇందుకు కారణం అవుతుండగా.. వృదులు తమ భావోద్వేగ శ్రేయస్సు, వ్యక్తిగత వృధికి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదని అంటున్నారు నిపుణులు.

అయితే 20, 30లలో విడాకులతో పోలిస్తే గ్రే డివోర్స్ చట్టపరమైన సవాళ్లను కలిగి ఉంది. ఆస్తుల విభజన, భరణం, పదవీ విరమణ ప్రయోజనాలు కఠిన సమస్యలుగా మారతాయి. ఈ జంట దశాబ్దాలుగా పెద్దమొత్తంలో సంపాదించిన ఉమ్మడి ఆస్తుల సమాన విభజన క్లిష్టంగా, వివాదాస్పదంగా ఉంటుంది. భారతదేశంలో 1955 హిందూ వివాహ చట్టం, 1954 ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం విడాకులను నియంత్రించే చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఉంది. ఈ చట్టాలు ఆస్తుల విభజన, భరణం, నిర్వహణ గురించి వివరిస్తాయి. కానీ గ్రే డివోర్స్ విషయానికి వస్తే పదవీ విరమణ ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు సంబంధించి మరింత సూక్ష్మమైన చట్టపరమైన విధానాలు అవసరం కావచ్చు అంటున్నారు నిపుణులు.

భరణం అనేది గ్రే విడాకుల్లో కీలకమైన అంశం. భరణం నిర్ణయించేటప్పుడు వివాహం బంధం కొనసాగిన కాలం, జీవిత భాగస్వాముల వయస్సు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి వంటి అంశాలను కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. కుటుంబ బాధ్యతల కోసం తమ వృత్తిని త్యాగం చేసిన వృద్ధ మహిళలకు.. విడాకుల తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి భరణం చాలా ముఖ్యమైనది. కాగా పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్లు కూడా ముఖ్యమైన చట్టపరమైన సవాళ్లను కలిగి ఉంటాయి. భార్యాభర్తలిద్దరి త్యాగాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానాలు ఈ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడాన్ని నిర్ణయించాలి. అంతేకాదు

వైద్య అవసరాలు పెరిగిన వృద్ధులకుఆరోగ్య సంరక్షణ, భీమా కవరేజీ లాంటివి కూడా అవసరం. భారతదేశంలో గ్రే డివోర్స్ రేటు విస్తృత సామాజిక మార్పులను, వివాహం విషయంలో అవగాహనలను ప్రతిబింబిస్తుంది. పెద్దలు వ్యక్తిగత సంతృప్తిని, ఆనందాన్ని కోరుకుంటారు కాబట్టి... ఈ విడాకుల ద్వారా ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా స్వీకరించాలి.

Advertisement

Next Story