A sense of honor : ఇతరులు మిమ్మల్ని గౌరవించాలా..? ఇలాంటి బిహేవియర్ ఉంటేనే అది సాధ్యం!

by Javid Pasha |
A sense of honor : ఇతరులు మిమ్మల్ని గౌరవించాలా..? ఇలాంటి బిహేవియర్ ఉంటేనే అది సాధ్యం!
X

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు ఎవరూ చెప్పరు మనమే తెలుసుకోవాలి సరదాకైనా అంటుంటారు కొందరు. అయితే ఆయా సందర్భాల్లో ఇవి నిజ జీవితానికి కూడా వర్తిస్తాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే సమాజంలో ప్రతీ ఒక్కరు గౌరవంగా మెలగాలని, ఇతరుల ద్వారా గౌరవించబడాలని సహజంగానే కోరుకుంటారు. అయితే ఇతరుల ద్వారా దీనిని పొందాలని ఆశిస్తే సరిపోదు. మీ ప్రవర్తన కూడా అందుకు తగ్గట్లుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో చూద్దాం.

మాటల్లో స్థిరత్వం

మనస్తత్వ శాస్త్రం ప్రకారం ప్రజలు తమ మాటల్లో, చర్యలలో స్థిరత్వం కలిగి ఉన్నవారిని గౌరవిస్తారు. ఇది విశ్వసనీయతను ప్రేరేపించే ప్రవర్తనగా నిపుణులు పేర్కొంటారు. అలాగే మీరు ఒకరికి ఏదైనా విషయంలో మాట ఇస్తే దానిని నిలబెట్టుకున్నప్పుడు అవతలి వారు మిమ్మల్ని గౌరవిస్తారు. పని విషయంలో, జీవితంలోని అనేక సందర్భాల్లో కూడా ఇది కనిపిస్తుంది. కాబట్టి మీ మాటల్లో, చేతల్లో స్థిరత్వం కనిపించినప్పుడు, మీరు మాట నిలబెట్టుకునే వారిగా ఇతరులు భావించినప్పుడు అవతలి వ్యక్తికి మీపై నమ్మకాన్ని పెంచుతుంది. సహజంగానే మీ గౌరవాన్ని పెంచుతుంది.

శ్రద్ధగా వినడం

ఎప్పుడూ మీతరపునే ఆలోచించడం. ఇతరులు చెప్పేది అస్సలు పట్టించుకోకపోవడం వంటి ప్రవర్తన ప్రజలకు మీపై నమ్మకాన్ని పోగొడుతుంది. పైగా మీరు నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా భావిస్తారు. ఈ విధమైన బిహేవియర్ ఉన్నవారు సమాజంలో గుర్తింపు, గౌరవం పొందడంలో ఇబ్బంది పడతారని నిపుణులు సూచిస్తున్నారు. మీకు ఎంత తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా ఇతరులు చెప్పేది కూడా శ్రద్ధగా వినాలి (Active listening). అవతలి వ్యక్తి మీకంటే చిన్నవారైనా, తక్కువ హోదా కలిగి ఉన్నా సరే.. మీరు వారి నుంచి నేర్చుకునే అంశాలు చాలా ఉంటాయి. అలా ఉండవని అనుకుంటే అది మీ అహంకారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా భావించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి ఇతరులు చెప్పేది మీకు నచ్చినా, నచ్చకపోయి ముందు శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాతే అది తప్పో, ఒప్పో, మీరు ఏకీభవిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో చెప్పవచ్చు. వినడం అయితే తప్పక చేయాలి. అదే మీ గౌరవాన్ని పెంచుతుంది.

సానుభూతి

మీరు ఇతరులతో కనెక్ట్ కావడంలో, ఇతరులు మిమ్మల్ని గౌరవించడంలో సానుభూతి(Empathy) కూడా కీలకపాత్ర పోషిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం, వారు చెప్పేది శ్రద్ధగా వినడం, అభిప్రాయాలను వ్యక్తీకరించడం, పరస్పర గౌరవ భావాన్ని కలిగి కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. వ్యక్తులు ఇతరులపై సానుభూతి చూపినప్పుడు వారి మెదడు అవతలి వ్యక్తి సానుభూతి చెందడాన్ని అనుకరిస్తుందని న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇది కేవలం సామాజిక నైతికతకు నిదర్శనమే కాదు. మీ మెదడుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మీపట్ల గౌరవ భావాన్ని పెంచుతుంది అంటున్నారు నిపుణులు.

నిజాయితీ

మీ నిజాయితే (Honesty) మీ గౌరవానికి మూల స్తంభం అంటుంటారు పెద్దలు. మీ ఆలోచనలు, ప్రవర్తనలో ఎప్పుడైతే అది కనిపిస్తుందో మీరు సహజంగానే ఇతరుల ద్వారా గౌరవించబడతారు. నిజాయితీ లేని ప్రవర్తన తాత్కాలిక ఫలితాలను ఇవ్వొచ్చు. కానీ చివరికి వైఫల్యం చెందుతుంది. ఇక్కడ నిజాయితీ అంటే.. మీరు సత్యాన్ని శ్రద్ధగా గ్రహించడం, గౌవర ప్రదంగా మాట్లాడటం మాత్రమే కాదు, మీ తప్పులను కప్పిపుచ్చుకోకపోవడం, వాటిని అంగీకరించడం, సరిదిద్దుకోవడం కూడా అంటున్నారు నిపుణులు. తప్పులు, పొరపాట్లు మానవ సహజం. అయితే వీటిని అంగీకరించకపోవడం నలుగురిలో మిమ్మల్ని చులకనగా నిలబెట్టవచ్చు. కాబట్టి విషయం ఏదైనా, తప్పు మీదైనా ధైర్యంగా అంగీకరించే గుణమే మీలోని నిజాయితీగా నిదర్శనంగా ప్రజలు భావిస్తారు. అప్పుడే గౌరవిస్తారు. అంతే తప్ప రెస్పెక్ట్ ప్లీజ్ అన్నంత మాత్రాన ఇతరులు, సమాజం మనల్ని గౌరవించదని నిపుణులు అంటున్నారు.

కైండ్‌నెస్

మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే.. ఉన్నంతలో సంతోషంగా ఉండాలన్నా, ఇతరులు మిమ్మల్ని గౌరవించాలన్నా దయాగుణం (Kindness) కలిగి ఉండాలంటున్నారు నిపుణులు. కొందరు దీనిని తక్కువ అంచనా వేస్తుంటారు. దయాగుణం చివరికి ఇబ్బందులపాలు చేస్తుందని చెప్తుంటారు. కానీ వాస్తవానికి అది అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. ఏదో ఒకరోజు అదే మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed