అందమైన అబద్దం.. ఇతరులను నమ్మించేలా సాకులు చెప్తున్న పలువురు!

by Javid Pasha |
అందమైన అబద్దం.. ఇతరులను నమ్మించేలా సాకులు చెప్తున్న పలువురు!
X

దిశ, ఫీచర్స్ : అబద్దాలు ఆడకూడదని, సాకులు చెప్పకూడదని మనం ఇతరులకు చెప్తుంటాం. కానీ అవసరానికో అబద్దం, తప్పించుకోవడానికో సాకు అన్నట్లు మనమే ఆ పనిచేస్తుంటాం. ఫలానా వ్యక్తి చాలా మంచోడు, ఎన్నడూ అబద్దాలు చెప్పడు. ఫలానా అమ్మాయి ఇన్నో‌సెంట్ ఏమాత్రం సాకులు చెప్పదు, అంటుంటారు కొందరు. అందులో వాస్తవం కూడా ఉండవచ్చు. అంతలా నమ్ముతున్నారంటే అవతలి వ్యక్తులు నిజాయితీ పరులే అయి ఉండి ఉండవచ్చు. చాలా వరకు అబద్దాలు, సాకులు చెప్పకపోవచ్చు. కానీ ఏదో ఒక సందర్భంలో కూడా చెప్పరా? అంటే.. నమ్మడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఎంతటి వ్యక్తి అయినా ఏదో ఒక సందర్భంలో అబద్దం లేదా సాకు చెప్తారు. కాకపోతే కొన్నిసార్లు మనం వాటిని గుర్తించకపోవచ్చు. అవతలి వ్యక్తి ఆడేది నిజమే అయినా కూడా కొన్నిసార్లు అబద్దంగానూ భావించవచ్చు. అంటే నమ్మశక్యం కానివి కూడా ఉంటాయి. కానీ నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అవతలి వ్యక్తి అందమైన అబద్దం ఆడినప్పుడు ఎటూ తేల్చుకోలేని, కాదనలేని కన్‌ఫ్యూజన్‌లో మనం కూరుకుపోతుంటాం.

సందర్భాలను అనువుగా మల్చుకోవడం

ముఖ్యమైన మీటింగ్‌కు అటెండ్ కావాల్సి ఉన్నప్పుడు, ఆఫీసుకు లేదా కాలేజ్‌కు లేటుగా వెళ్లినప్పుడు, ఉద్దేశ పూర్వకంగా డుమ్మా కొట్టాలనుకున్నప్పుడు కొన్నిసార్లు నిజమైన కారణాలు ఉండవచ్చు. మరికొన్నిసార్లు కావాలనే సాకులు చెప్పడం, నిజమని నమ్మించేలా అందంగా అబద్దాలు ఆడటం వంటివి మనుషుల్లో కనిపించే సహజమైన ప్రవర్తనగా ఉంటాయి. ఇంకొన్నిసార్లు అవతలి వ్యక్తి నిజాలు చెప్తున్నప్పటికీ ఆ స్విచ్యువేషన్‌ను బట్టి నమ్మాలనిపించదు. ఉదాహరణకు..‘‘దారిలో వస్తుండగా బైక్ పంక్చరైంది. జ్వరం వచ్చింది, ట్రాఫిక్ జామ్ అయింది, బస్ మిస్ అయింది, అనుకోకుండా వేరే రూట్‌లో వచ్చాను. నేనే ఫోన్ చేద్దామనుకున్న అంతలోనే నువ్వు చేశావ్’’ వంటి మాటలు కొన్నిసార్లు నమ్మశక్యం కానివిగా అనిపిస్తుంటాయి. కానీ నమ్మక తప్పదు.

ఇష్టం లేనప్పుడు చెప్పే అబద్దం

మీరు ఇంట్లో ఉన్నారు. సడెన్‌గా ఫోన్ మోగుతుంది. చూస్తే అది క్లోజ్ ఫ్రెండ్ నెంబర్ కాబట్టి రిసీవ్ చేసుకున్నారు. ఫోన్ ఎత్తగానే షాపింగ్‌కు వెళ్దాం వస్తావా? అని అడిగిందనుకోండి. అప్పుడేం చేస్తారు? ఆసక్తి ఉంటే వెళ్తారు. లేకపోతే అందమైన అబద్దం ఒకటి ఆడేస్తారు. అదెలా ఉంటుందంటే.. ‘అయ్యో రెండు రోజులుగా బట్టలు ఉతుక్కోలేదు. ఇంతకు ముందే మొత్తం ఉతికి ఆరేషాననో, లేకపోతే నిన్నటి నుంచి వర్షం కారణంగా ఉతికిన బట్టలు ఆరలేదు వేసుకోవడానికి ఉతికి డ్రెస్ లేదనో చెప్పేస్తారు. అంటే ఇక్కడ సదరు వ్యక్తి తాను రాను అని మొహం మీదే చెప్పలేక అందమైన అబద్దం ఆడేస్తుంటారన్నమాట. అవతలి వ్యక్తికి ఇది నమ్మశక్యం కాకపోయినా నమ్మి తీరాల్సిందే ఇక.

పరిస్థితులను అనుకూలంగా మల్చుకోవడం

కొందరైతే అబద్దాలు, సాకులు చెప్పడంలో యమ టాలెంటెడ్‌గా ఉంటారు. వారు చెప్పేది నిజంగా నిజమే అనిపించేలా క్రియేటివిటీ ప్రదర్శిస్తుంటారు. అప్పటికప్పుడు తమ ముందున్న పరిస్థితులను అందమైన అబద్దాల అల్లికల్లో బందించేస్తుంటారు. ప్రతీ సిచ్యువేషన్‌ను అనుకూలంగా మల్చుకొని అబద్దం ఆడేస్తుంటారు. ముఖ్యంగా ఆరోజు చేయాల్సిన పనులు వాయిదా వేయడానికి, ఆలస్యంగా చేసిన పనులను సమర్థించుకోవడానికి, టైమ్‌కు వెళ్లలేని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తారు. ఉదాహరణకు వెదర్ అనుకూలించలేదు కాబట్టి బయలు దేరలేదనో, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఆ పని చేయలేకపోయామనో చెప్తుంటారు. విన్నవారికి నిజమేనా అనే అనుమానం మనసులో కలిగినా మీరు చెప్పిన అందమైన అబద్దాన్ని కాదనలేరు.

తమ అవసరాలకు ఇతరులు బలి

తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రొఫెషనల్ లేదా ఇతర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి సాకులు చెప్తుంటారు కొందరు. అందమైన అబద్దాలను అప్పటికప్పుడు అల్లేస్తుంటారు. ఉదాహరణకు మీ సొంత పని ఉన్నందున ఆ రోజు ఆఫీసుకో, కాలేజికో, వెళ్లాల్సిన ఊరికో ఉద్దేశ పూర్వకంగానే వెళ్లలేకపోతారు. లేకపోతే కాస్త ఆలస్యమై వెళ్దామనుకొని ఉండిపోతారు. కానీ అవతలి నుంచి ఫోన్ వచ్చిందనుకోండి ఏం చేస్తారు?. వెంటనే ఓ సాకు వెతుక్కుంటారు. మీరు స్టూడెంట్స్ అయితే గనుక అప్పటికే చనిపోయిన మీ తాతనో, నానమ్మనో మరోసారి చంపేస్తారు! ఎంతో బాధగా ‘మా తాతా పోయాడు సర్’ అందుకే రాలేకపోయా అనేస్తారు. అవతలి వ్యక్తికి మీరు సాకు చెప్తున్నట్లు అనుమానం వచ్చినా సరే సచ్చినట్లు నమ్మాల్సిందే. అందమైన అబద్దానికి ఉన్న పవర్ అది.

అనుకోకుండా జరిగిపోయింది..

అనుకోకుండా జరిగిపోయిందనే సాకు చాలామంది వాడేస్తుంటారు. నిజానికి ఒదొక బ్రిలియంట్ ఐడియా! మీరు ఎంత లేటుగా వెళ్లినా అవతలి వ్యక్తి మీపై కోపం ప్రదర్శించడానికి వీల్లేనంత పవర్ ఫుల్. కొన్నిసార్లు అది నిజమే కావచ్చు కూడా కానీ. అన్నిసార్లు నిజాలే చెప్తారనే గ్యారెంటీ లేదు. అందుకే అనుకోకుండా జరిగిపోయిందనో, బోర్డు చూడకుండా వేరే రూట్ బస్సెక్కాను అనో, తిరిగి తిరిగి వచ్చేసరికి ఈ టైమ్ అయిందనో సాకులు, అందమైన అబద్దాలు చెప్పేస్తుంటారు. అవతలి వ్యక్తికి మీరు చెప్పేది నిజమో, సాకో అనే అనుమానం వచ్చినా చేసేదేమీ ఉండదు. మీరు చెప్పింది సాకు అని నిరూపించే ధైర్యం కూడా చేయరు. మరికొందరు రోడ్డు బాగాలేదని, వర్షంవల్ల సమస్య ఏర్పడిందని, మధ్యలోకి వచ్చాక పెట్రోల్ అయిపోతే ఎవరినో లిఫ్ట్ అడిగి పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి, ఆయిల్ తెచ్చి, ఫిల్ చేసుకొని వచ్చేవరకు ఈ టైమైంది అని కూడా కథలు అల్లేస్తుంటారు. విన్నవారికి అబ్బ ఛ అనిపించినా చేసేదేమీ ఉండదు.

అసలు విషయం చెప్పలేక..

మీరు ఏదో వ్యక్తిగత పనిమీద మరోచోట ఉండవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్‌తో పార్కులోనో, జర్నీలోనో ఉండి ఉండవవచ్చు. ఆ సమయంలో సడెన్‌గా ఫోన్ వస్తుంది. ఎక్కడున్నారు? అని అడిగారనుకోండి.. మీరు నిజాయితీ పరులే కావచ్చు. కానీ చచ్చినా నిజం చెప్పరు. ఆ క్షణంలో ఎక్కడ ఉన్నామో చెప్పకూడదు అనుకుంటారు కాబట్టి అందంగా ఓ అబద్దం ఆడేస్తుంటారు. రాత్రంతా నిద్రలేదు ఇప్పుడే లేచి బయటకు వచ్చాను వేరే దగ్గర ఉన్నాననో, వేరే పనిమీద ఊరికి వెళ్తున్న.. మధ్యలో ఉన్నాను కానీ ఇది ఏ ఊరో తెలియదనో సాకు చెప్పేస్తుంటారు. తప్ప మీరు ఏ ప్లేస్‌లో ఉన్నది మాత్రం చెప్పరు.

అయ్యే ఈరోజు ఫలానా తేదీ అనుకున్న

కొందరు ఆరోజు డ్యూటీకి వెళ్లొద్దని ఫిక్స్ అవుతారు. పిల్లలైతే స్కూలు లేదా కాలేజీకి వెళ్లొద్దని అనుకుంటారు. కావాలనే నిద్రలేకుండా పడుకుంటారు లేదా మరో పనిలో నిమగ్నమై ఉంటారు. సడెన్‌గా తల్లిదండ్రులో, స్నేహితులో ఏమైంది వెళ్లలేదు? ఇంకా లేవలేదు? అన్నారనుకోండి.. వెంటనే ఓ అందమైన అబద్దం పుట్టుకొస్తుంది. అయ్యో వెళ్లాలి కదా ఈ రోజు నేను సందే అనుకున్నా లేదా ఫలానా డేట్ కాబట్టి వెళ్లాల్సిన అవసరం లేదనుకున్న అని ఇలా ఏదో ఒకసాకు చెప్పేస్తుంటారు. ఇంటిలో, ఆఫీసులో, బయట నలుగురిలో ఉన్నప్పుడు ఇలా ప్రతిచోట అందమైన అబద్దాలు, సాకులు ఆయా వ్యక్తులను తమ అవసరాలను బట్టి యూజ్ చేస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed