పెరిగిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం 

by  |
పెరిగిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం 
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గృహ రుణాల సంస్థ, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 33.86 శాతం వృద్ధితో రూ. 817.48 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 610.68 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 3.5 శాతం పెరిగి రూ. 4,977.49 కోట్లుగా నమోదైంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 4,807.21 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి త్రైమాసికానికి హౌసింగ్ ఫైనాన్స్ నికర వడ్డీ ఆదాయం రూ. 4,985.08 కోట్లు ఉండగా, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ వడ్డీ ఆదాయం రూ. 4,784.45 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నివాస గృహాల కొనుగోలు, నిర్మాణానికి రుణాలను అందించడం సంస్థ ప్రధాన వ్యాపారం. మిగిలిన ఇతర కార్యకలాపాలు ప్రధాన వ్యాపారం కిందనే ఉన్నాయని, ప్రత్యేకంగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొనదగిన విభాగాలు లేవని కంపెనీ వెల్లడించింది.

కొవిడ్-19 ప్రభావం గురించి… కరోనా వ్యాప్తి ప్రజల జీవితం, వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర అనిశ్చితిని ఏర్పరచిందని… దీన్ని అధిగమించడానికి, సాధారణ స్థితి చేరేందుకు సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో వ్యాపారాలపై, ఆర్థిక ఫలితాలపై కరోనా వ్యాప్తి ఎంతమేరకు ప్రభావితం చేస్తుందనేది, రానున్న పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇది అనిశ్చిత స్థితిలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది.


Next Story

Most Viewed