వామపక్ష ఎంపీలకు అక్కడ నో ఎంట్రీ

by Shamantha N |
Administrator-Praful-Patel
X

కొచ్చి: వామపక్ష పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీల పర్యటనకు లక్షద్వీప్ పాలనాయంత్రాంగం అనుమతి నిరాకరించింది. వారి పర్యటనతో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లి అశాంతి చెలరేగే ముప్పు ఉన్నదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్‌లో ప్రజా వ్యతిరేక సంస్కరణలు చేపడుతున్నారని అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌కు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీలు దీవులు పర్యటించాలని భావించగా అక్కడి అధికారులు అనుమతి నిరాకరించారు. తాజాగా, లెఫ్ట్ పార్టీ ఎంపీల అభ్యర్థననూ తోసిపుచ్చారు.

రాజ్యసభ ఎంపీలు ఎమలారం కరీమ్, వీ శివదాసన్, బినయ్ విశ్వం, ఎంవీ శ్రేయమ్స్ కుమార్, కే సోమప్రసాద్, జాన్ బ్రిట్టాస్‌లు సహా లోక్‌సభ ఎంపీలు థామస్ చళికాదన్, ఏఎం అరీఫ్‌లు లక్షదీవుల పర్యటనకు సిద్ధమయ్యారు. కానీ, లక్షద్వీపు కలెక్టర్ అస్కర్ అలీ వీరి పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదు. లక్షదీవుల్లో రాజకీయాల కోసం వీరు చేపట్టే పర్యటనలు శాంతి భద్రతలను భగ్నం చేయవచ్చని, దీవుల్లో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని కుదిపేయవచ్చని పేర్కొంటూ ఆయన అనుమతి నిరాకరించారు. వీరి పర్యటన కేంద్రపాలిత ప్రాంతంలోని చట్టబద్ధపాలనకు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed