చర్లలో మావోలకు వ్యతిరేకంగా కరపత్రాలు…..

by Sumithra |
చర్లలో మావోలకు వ్యతిరేకంగా కరపత్రాలు…..
X

దిశ, భద్రాచలం : బంద్ రోజు మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి. ఈ విషయం ఇప్పుడు భద్రాద్రి ఏజెన్సీలో చర్చనీయాంశమైంది. ఈనెలలో తెలంగాణలో వరుసగా జరిగిన నాలుగు ఎనకౌంటర్లు బూటకమేనని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. వాటికి నిరసనగా ఈ నెల 28 సోమవారం రాష్ట్ర బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈనెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల‌ మండలంలో జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ ఈ నెల6న బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా ఆరోజు బంద్ ప్రశాంతంగా జరిగిందని అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఇంతలోనే ఊహించని విధంగా మావోయిస్టులు ఆ రాత్రి చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో శక్తివంతమైన మందుపాతర పేల్చి రోడ్డును ధ్వంసం చేశారు. ఆ ఘటన నేపథ్యంలో బంద్ సందర్భంగా ఈసారి కూడా మావోయిస్టులు ఏదైనా అలజడి సృష్టించవచ్చని అందరూ టెన్షన్ తో ఉన్నారు. అలాంటి సమయంలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పలుచోట్ల ఈ తరహా కరపత్రాలు వెలుగు చూడటంతో ప్రజల దృష్టి అటువైపు మరలింది.‌ ఆదివాసీల ఉసురు తీస్తున్నది ఎవరు అనే హెడ్డింగుతో ఉన్న కరపత్రాల్లోని అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ఇవి వేసింది ఎవరు అనేది కరపత్రాల్లో లేక పోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed