కాంగ్రెస్.. ఇట్ ఈజ్ జంపింగ్ టైం..!

by Shyam |   ( Updated:2020-11-11 22:18:59.0  )
కాంగ్రెస్.. ఇట్ ఈజ్ జంపింగ్ టైం..!
X

‘ఉందామా.. పోదామా..? ఉంటే ఏంటి పరిస్థితి.. పోతే దక్కేదేంటి..? ఇప్పుడు పోకపోతే మున్ముందు కష్టమయ్యేట్టే ఉంది.. దీపమున్నప్పుడే చక్కదిద్దుకోవాల్సిన తరుణమిదే..’ ఇది సగటు కాంగ్రెస్​ క్యాడర్​లో నెలకొన్న అనిశ్చితి.. దుబ్బాక ఫలితంతో ఆలోచనలకు పదును పెడుతూ, భవిష్యత్తుకు దారి వెతుక్కునే పనిలో పడ్డట్టు సమాచారం. దాదాపు అన్ని స్థాయిల నేతలు ఫ్యూచర్​ బాగుండే పార్టీవైపు చూపులు సారిస్తూ, సోర్స్​ కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎల్లుండి రాములమ్మ వలసతోనే ఆ కార్యక్రమం స్టార్ట్​ అయ్యే అవకాశాలున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ నేతల్లో భవిష్యత్తు భయం పట్టుకుంది. నాయకత్వ లోపాలు కూడా పార్టీ శ్రేణులను కుంగదీస్తున్నాయి. దుబ్బాక ఫలితాలతో నేతలు సందిగ్ధంలో పడ్డారు. గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పొలిటికల్​ కెరీర్​ ప్రశార్థకమవుతుందనే కోణంలో హస్తం నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీలోకి వెళ్లాలా.., రాజకీయంగా బలపడుతున్న బీజేపీ వైపు మళ్లాలా అనే దిశగా ఆలోచిస్తున్నారు.

రాములమ్మతో శ్రీకారం..

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్​పర్సన్​ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖరారైంది. ఈ నెల 14న ఢిల్లీ వెళ్తునున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్​ నాయకత్వంపై విజయశాంతి అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందంటూ రాష్ట్ర ఇన్​చార్జి మాణిక్యం ఠాగూర్​తోనే వాదించారు. పార్టీ మారడంపై ఠాగూర్​ వారించారు, కానీ దుబ్బాక పరిణామాల తర్వాత రాములమ్మ బీజేపీలో చేరడం తేలిపోయింది. అలాగే, కాంగ్రెస్​ నేత అద్దంకి దయాకర్​ కూడా బీజేపీ వైపు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దయాకర్​తో పాటు రాష్ట్ర నేతలు పలువురు పార్టీ మారేందుకే సిద్ధమవుతున్నారు.

పెరుగుతున్న అసహనం..

కాంగ్రెస్​ రాష్ట్ర నాయకత్వంపై రెండేండ్ల నుంచి పార్టీ శ్రేణుల్లో అసహనం పెరుగుతోంది. నేతలు ఎవరికి వారే వ్యవహరిస్తుండటంతో పాటు కొత్తగా చేరిన రేవంత్​రెడ్డి వంటి వారికి అడ్డుతగలడం, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారు లేకపోవడం వంటి అంశాలు నేతలను కుంగదీస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకుని దుబ్బాక ఎన్నికల వరకు అగ్రనేతల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హుజూర్​నగర్​ లో పార్టీ చేతులెత్తేయడం, స్థానిక ఎన్నికలపై కూడా సీరియస్​నెస్​ లేకపోవడం నిరాశగా ఫీల్​ అవుతున్నారు. ఠాగూర్​ నియామకం తర్వాత మార్పులు ఉంటాయని భావించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది.

ఉందామా… పోదామా..?

కాంగ్రెస్​ పార్టీకి సంస్థాగతంగా కేడర్​ ఉన్నా నిలుపుకోవడంలో నాయకత్వం విఫలమవుతుందనే ప్రచారం ఉంది. దీనికి తోడు వరుస పరిణామాలు రాష్ట్రస్థాయి నుంచి గల్లీస్థాయి వరకు నేతలను పార్టీకి దూరం చేసేవిగా మారుతున్నాయి. గ్రేటర్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పోటీ ఇస్తుందా అనేదీ అనుమానంగానే మారింది. వరద పరిహారం పంపిణీ అక్రమాలపై ఎంపీ రేవంత్​రెడ్డి నిరసనలకు దిగుతున్నా ఒక్కరు కూడా సహకరించకపోవడం, అదే సమయంలో బీజేపీ దూకుడుగా పెంచడం వంటి పరిస్థితుల్లో పార్టీని పట్టుకుని వేలాడటం కంటే వదిలేయడమే మంచిదని భావిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్​ఎస్​ పార్టీలో చేరిన నేతలు పదవుల కోసం ఎదురుచూడటం, నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్​ నేతల రాకకు తలుపులు తెరిచింది. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్​ నుంచి బీజేపీకి వలసలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed