‘భిక్షాటన చేసైనా ఆదుకుంటాం’

by Shyam |
‘భిక్షాటన చేసైనా ఆదుకుంటాం’
X

దిశ, డోర్నకల్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ప్రైవేట్ టీచర్ల భరోసా యాత్ర ఆదివారం మరిపెడ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ షబ్బీర్ అలీ భారీ ర్యాలీ తీస్తూ.. భిక్షాటన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ప్రైవేటు టీచర్లను పట్టించుకోలేదని, స్కూల్ యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో ప్రైవేటు టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేగాకుండా కొంతమంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఇకనుంచి దయచేసి ఏ ప్రైవేట్ టీచర్ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని అవసరమైతే భిక్షాటన చేసి అయినా వారిని ఆదుకుంటామని అన్నారు. భిక్షాటన చేసి సంపాదించిన ధనంతో పాటు, లలిత నర్సింగ్ హోమ్ వారి సహకారంతో 30 మంది ప్రైవేట్ టీచర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున, ప్రైవేట్ టీచర్ల తరపున పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story