నల్ల కండువాలతో అసెంబ్లీకి ప్రతిపక్ష నేతలు.. ఎందుకో తెలుసా..?

by Shyam |   ( Updated:2021-03-23 01:37:02.0  )
నల్ల కండువాలతో అసెంబ్లీకి ప్రతిపక్ష నేతలు.. ఎందుకో తెలుసా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కాంగ్రెస్​ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సభను ఇష్టారాజ్యంగా నడుపుకుంటున్నారని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనే అడిగించుకుంటూ మంత్రులు సమాధానం చెప్పే విధంగా ప్లాన్​ చేశారని విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులకు కనీసం మాట్లాడేందుకు మైక్​ ఇవ్వడం లేదని, ప్రతిపక్ష నేతలు మాట్లాడకుండా.. సభలో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్​ ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వం తరుఫున వివరణ ఇచ్చేందుకే అధికారపక్షం సమయం తీసుకుంటుందని, దానిపై చర్చించేందుకు కాంగ్రెస్​ సభ్యులకు అవకాశమే ఇవ్వడం లేదంటూ ఫైర్​అయ్యారు.

దీంతో గన్​పార్క్​ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదంటూ నినాదాలు చేస్తూ ఆరోపించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటుగా ఎమ్మెల్యేలు శ్రీధర్​బాబు, సీతక్క, రాజగోపాల్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి నల్ల కండువాలతో నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్​ ఎమ్మెల్యేలంతా నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు.

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభను ఏకపక్షంగా నడుపుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో కూడా ఛాన్స్​ ఇవ్వలేదని, వారే ప్రశ్నలు అడుగుతూ వాళ్లే సమాధానం చెప్పుకుంటున్నారన్నారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను సభలో ఒక్కరు కూడా ప్రస్తావించడంలేదని, కేవలం అధికార పార్టీకి అక్కరకు వచ్చే ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్‌కు దీనిపై వివరంగా లేఖ ఇస్తున్నామని, టీ బ్రేక్‌లో స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి తెలిపారు.

రాజగోపాల్​రెడ్డి కలిసి వచ్చాడు..

కాంగ్రెస్​స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​పార్టీ ఎమ్మెల్యేలతో నిరసనలకు కలిసి వచ్చాడు. సందర్భం ఏదైనా… ఎక్కడైనా కాంగ్రెస్‌ను విమర్శించడం, బీజేపీని ఎత్తుకోవడం ఇటీవల రాజగోపాల్ రెడ్డికి పరిపాటిగా మారింది. ఏకంగా బీజేపీ నుంచే పోటీ చేసేందుకు ఆఫర్ కూడా వచ్చిందంటూ ప్రకటించారు. రాజగోపాల్​రెడ్డి 2018 నుంచే కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేసుకుంటూ వస్తున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమైందంటూ పార్టీలో చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం గన్​పార్క్​ దగ్గర కాంగ్రెస్​ నిరసనకు నల్ల కండువాతో రాజగోపాల్​రెడ్డి కూడా కలిసి వచ్చారు. ఎప్పుడూ కాంగ్రెస్ సభ్యులతో వేరుగా ఉండే ఆయన కలిసి రావడం అధికార, ప్రతిపక్ష పార్టీలో చర్చగా మారింది.

మా హక్కులను కాపాడండి : శ్రీధర్​బాబు

గన్​పార్క్​ దగ్గర నిరసన అనంతరం కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీధర్​బాబు మాట్లాడారు. తాము ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులను కాపాడాలని స్పీకర్‌ను కూడా కోరామన్నారు. సమయం ఇచ్చినా, ఇవ్వక పోయినా ప్రజల పక్షాన తమ గొంతును వినిపిస్తున్నామని, ప్రజల సమస్యలు వినడానికి అధికార పార్టీ నేతలకు ఓపిక కూడా లేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు. సభలో ప్రజా సమస్యలు కాకుండా సొంత సమస్యలపై మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలు సమస్యలను చెప్పకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఇక అధికార పార్టీ సభ్యులే అసెంబ్లీ నడుపుకుంటే మంచిదని శ్రీధర్​బాబు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed