జగనన్న విద్యాదీవెన ప్రారంభించిన జగన్

by srinivas |
జగనన్న విద్యాదీవెన ప్రారంభించిన జగన్
X

ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో మాట్లాడారు. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువే అని, అందుకే అందరి ఆశీర్వాదంతో తానీ పథకాన్ని ప్రారంభించానని ఆయన అన్నారు.

మంచి చదువులతోనే పేదల బతుకులు మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ‘వసతి దీవెన’పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ‘విద్యా దీవెన’అనే రెండు పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వచ్చే విద్యా సంవత్సరం అంటే 2020-21కి సంబంధించి ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే తల్లుల ఖాతాలోనే నేరుగా జమచేస్తామని ప్రకటించారు. విద్యార్థుల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫీజుగా ఏడాదికి 20 వేల రూపాయలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మొత్తాన్ని కూడా తల్లుల అకౌంట్‌లోనే వేస్తున్నామని, తద్వారా కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ఉంటాయని ఆయన ఆకాంక్షించారు. పిల్లలు విద్యనభ్యసించే కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ బాగా లేకపోయినా, వసతులు లేకపోయినా ప్రశ్నించే అధికారం విద్యార్థుల తల్లులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

పేదలను ఆదుకోవాలని, పేదల చదువుకు సాయపడాలన్న తాపత్రాయంతో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు మొదటిసారిగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని జగన్ గుర్తుచేశారు. పేదలు పెద్ద చదువులు చదివితే వారి బతుకులు బాగుపడతాయని నమ్మారని ఆయన తెలిపారు. దానిని ఆ తరువాతి ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ఇప్పటికే ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజ్ కడితే కనుక ఆ డబ్బును కాలేజీ యాజమాన్యాలు వెనక్కి ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కాలేజీ యాజమాన్యాలతో ఈ విషయంలో సమస్యలేవైనా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు 1902 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఉన్నత విద్యా శాఖలో కాల్ సెంటర్ ఉంటుందని, దీనిని సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని తెలిపారు.

Tags: ysrcp, ap, ys jagan, vidya deevena, education schame

Advertisement

Next Story

Most Viewed