రైతుల కోసం 150వ కిసాన్ రైలు ప్రారంభం

by Harish |
Kisan Train
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులకు, వ్యాపారస్తులకు తోడ్పడాలనే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే కిసాన్ రైళ్లను నడుపుతోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అన్నారు. సోమవారం మహారాష్ట్రలోని నాగర్‌సోల్ నుంచి 150వ కిసాన్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ సోల్ నుంచి మొదటి కిసాన్ రైలు ఈ ఏడాది జనవరి 5న ప్రారంభించామని, అప్పటి నుంచి 150వ కిసాన్ రైలు ప్రారంభానికి 126 రోజులు మాత్రమే పట్టిందని వెల్లడించారు.

ఇది దక్షిణ మధ్య రైల్వేలో ఒకే ప్రాంతం నుంచి రవాణా కావడం గమనార్హం అని, 150వ కిసాన్ రైలు 246 టన్నుల ఉల్లిపాయలను పశ్చిమబెంగాల్ లోని మాల్దా పట్టణానికి రవాణా చేసినట్లు తెలిపారు. నాగర్‌సోల్ నుంచి కిసాన్ రైళ్ల ద్వారా 47,957 వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేశామని, అందులో ఉల్లిపాయలు, పుచ్చకాయలు, ద్రాక్ష ఉన్నాయని తెలిపారు. వీటిని ఢిల్లీలోని ఆదర్శనగర్, న్యూ గౌహతి, మాల్దా, అగర్తలా, ఫతూహ, న్యూ జాల్పాయిగురి ప్రాంతాలకు రవాణా చేసినట్లు వెల్లడించారు. కిసాన్ రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ ‘ఆపరేషన్స్ గ్రీన్స్ -టీఓపీటు టోటల్’ పథకం కింద రైతులు, వ్యాపారస్తులకు 50శాతం రాయితీని అందజేస్తుందని వెల్లడించారు.

రైతులు, వ్యాపారస్తుల సరుకులను భద్రంగా, సురక్షితంగా, వేగంగా, ఆర్థిక ప్రయోజనకరంగా రవాణా చేయడానికి కిసాన్ రైళ్లు దోహదపడుతున్నాయని తెలిపారు. తక్కువ వ్యవధిలో 150 కిసాన్ రైళ్లను నడిపిన నాందేడ్ డివిజన్ బృందాన్ని అభినందించారు. వ్యవసాయ రంగానికి తోడ్పాటు అందించే ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని బృందానికి సూచించారు. కార్యక్రమంలో నాందేడ్ డివిజన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story