Sajjanar: వాళ్లకు డబ్బే సర్వస్వం.. ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది: సజ్జనార్

by D.Reddy |   ( Updated:2025-03-15 07:21:53.0  )
Sajjanar: వాళ్లకు డబ్బే సర్వస్వం.. ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది: సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్‌కు బానిసై.. అప్పుల బారిన పడి, తీర్చలేక ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్‌ను చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు (Social media influencers) ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో ఫాలో అవుతున్నా, తాము అభిమానించే సెలబ్రిటీలే వీటి గురించి పాజిటివ్‌గా ప్రమోట్ చేయటంతో ఫాలోవర్స్ అంతా గుడ్డిగా ఈ యాప్స్ మోసాల బారిన పడుతున్నారు. అయితే వీటి వల్ల ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రభుత్వం కూడా వీటిపై కఠినంగా వ్యవహరిస్తుంది.

ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ (Sajjanar, IPS) తనదైన శైలిలో సైబర్ నేరాలపై పరిష్కారం చూపుతున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాదు, యువతలో అవగాహన కల్పించేందుకు వరుసగా వీటిపై ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జనార్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోలో హర్ష సాయి తన తప్పును ఎంత చక్కగా సమర్థించుకుంటున్నాడో చూడొచ్చు. 'నేను బెట్టింగ్ యాప్‌లను చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నాను. నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్లు చేస్తారు కదా.. అయినా నాలాంటి వాళ్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం తప్పు కాదు.. చేయకపోతే తప్పు' అంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను సజ్జనార్ షేర్ చేస్తూ.. 'చేస్తున్న‌దే త‌ప్పు, అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు. ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి' అని రాసుకొచ్చారు.

అంతేకాదు, ఫాలోయింగ్‌ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోందని ప్రశ్నించారు. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయాలని సూచించారు. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టాలని, ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.

Read More : Betting Apps: సుప్రీత చేసింది.. రైటా రాంగా..?.. ఆమె చేసింది ఎంత వరకు కరెక్ట్..?

Next Story

Most Viewed