గౌరవం పెరిగేలా ముందుకు సాగాలి: నర్మద

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఏ రంగంలోనైనా కష్టపడి పని చేసినప్పుడే అందుకు తగిన గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోగలమని జిల్లా అదనపు ఎస్పీ నర్మద అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ అధ్యక్షతన జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. పోలీస్ వృత్తి ద్వారా న్యాయం కోసం ఎదురు చూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అయితే ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకంతో సమజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఎక్కడ ఉన్నా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజలలో మరింత పెంచడం, ప్రజలకు పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించేలా రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు చూడాలని ఆమె కోరారు. సుమారు 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని ఆమె చెప్పారు.

Advertisement