- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డొంక కదులుతుంటే.. అధికారులే ఆశ్చర్యపోతున్నారు!
దిశ, ఆదిలాబాద్: వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని అనుకున్నారు. కానీ, అటూ ఇటూగా పదివేల ఎకరాలకు పైగానే పరాధీనం అయినట్టు కనిపిస్తున్నది. స్థానికంగా రెండు, మూడు మండలాలకే పరిమితం అయింది అనుకున్నా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ భూముల ఆక్రమణల పర్వం తాజాగా రెండు జిల్లాల్లో కనిపిస్తున్నది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతం ఇరువైపులా భూముల ఆక్రమణల బాగోతం ఒక్కొక్కటి బయట పడుతుంటే అక్రమాల తంతుతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఇప్పుడు ఆక్రమణలను అడ్డుకోకపోతే, భవిష్యత్తులో మరెప్పుడూ ఎస్సారెస్పీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరగదని రెవెన్యూ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో ముంపు భూములు ఆక్రమణకు గురైన విషయాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోన్నది. ఇంతకాలం భూముల ఆక్రమణ అంటే ప్రాజెక్టు సరిహద్దుల్లో ఎంతో కొంత భూమిని కబ్జా పెట్టి అనుభవిస్తున్నారని అనుకున్నామని, కానీ, ఈ స్థాయిలో ప్రాజెక్టు భూములను చెరబట్టారని అనుకోలేదని ఉన్నత స్థాయి అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా రెండు జిల్లాలకు సంబంధించిన భూములను రైతుల నుంచి సేకరించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులుగా నిర్ధారించి అనంతరం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 1093 అడుగుల గరిష్ట నీటిమట్టంతో రైతుల నుంచి భూములు సేకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో 57 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 40 వేల ఎకరాలను అధికారులు సేకరించి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులతో నిర్మాణం పూర్తి చేశారు.
భవిష్యత్తు కోసం సేకరించిన భూములు అన్యక్రాంతం
ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులతో నిర్మించడంతో అక్రమార్కులకు కలిసి వచ్చింది. ప్రాజెక్టు భవిష్యత్తు గురించి సేకరించిన భూములు ఇప్పుడు అన్యాక్రాంతం అవుతున్నాయి. మరో రెండు అడుగులు ఎత్తు పెంచే ఉద్దేశంతో భూములు రైతుల నుంచి కొనుగోలు చేసినప్పటికీ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు పెంచకపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. గతంలో ఉన్న పట్టాదారుల వివరాలను సేకరించి వారి నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇలా సుమారు 10వేల ఎకరాలకు పైబడి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురికాకుండా ఉండే భూములు ఉన్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి భూములు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
గోదావరి పరివాహక ప్రాంతంలోనూ..
శ్రీరాంసాగర్ భూములను కబ్జా పెడుతున్న అక్రమార్కులు బ్యాక్ వాటర్ ముంపు భూములతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని భూములను సైతం కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాసర సమీపంలో తెలంగాణలో ప్రవేశిస్తున్న గోదావరి నదికి ఇరువైపుల నిర్మల్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. గోదావరికి ఇరువైపులా ఉన్న పరివాహక ప్రాంతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ సేకరించిన భూములు సైతం కబ్జాకు గురవుతున్న విషయాలు అధికారుల దృష్టికి వచ్చాయి. బ్యాక్ వాటర్ ప్రాంతాలను సమీపించి ఉన్న ముధోల్, బాసర, లోకేశ్వరం ప్రాంతాలతో పాటు పరివాహక ప్రాంతాలైన నర్సాపూర్ జి, దిలావర్ పూర్ మండలంలో… అలాగే నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, నందిపేట, రెంజల్ తదితర మండలాల్లోని భారీగా భూముల ఆక్రమణ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
చేపలు చెరువులు, ఫామ్‌హౌస్‌లు..
ఈ భూముల్లో చేపల చెరువులతో పాటు వందలాది ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాలు వెలిశాయి. మరోవైపు ఆక్రమణదారులు పాత పట్టాదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ఈ భూముల ఆక్రమణలో అధికార పార్టీ నేతలతో పాటు పలువురు సీనియర్ రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కూడా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి గ్రామ సమీపంలో రెవెన్యూ అధికారుల సర్వేలో చేపల చెరువులు వెలుగుచూశాయి. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దూరంగా వెళ్లిపోవడంతో అక్కడ చేపల చెరువు నిర్వహిస్తున్న ఒకరు ఏకంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీటిని వినియోగిస్తుండటం గమనార్హం. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి ఎత్తిపోతల పథకం కోసం తవ్విన కాళేశ్వరం డీ-27, 28 ప్రధాన కాల్వలలో ఉన్న నీటిని యథేచ్ఛగా వాడేస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లు ఎక్కడికక్కడ తీసుకొని కరెంటు మోటార్లతో వ్యవసాయం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పలువురు ప్రముఖులు ఇలాంటి భూములను చెరబట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.