రోస్టర్ విధానం అమలు చేయాలి

by Shyam |

దిశ, క్రైమ్‌బ్యూరో: తెలంగాణ పోలీస్‌శాఖలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన అధికారులకు ప్రమోషన్లలో రోస్టర్ విధానాన్ని అమలు చేయక పోవడంతో అన్యాయం జరుగుతోందని లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షులు డాక్టర్ రాజకుమార్ జాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ శాఖలో గిరిజన అధికారులను వివిధ రకాల ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల జోక్యంతో పోస్టింగ్ కేటాయింపులో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

బదిలీల్లో హెచ్ఆర్ఏ తక్కువ ఉన్న మారుమూల ప్రాంతాల పోస్టింగ్‌లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. సరిగ్గా ప్రమోషన్ సమయంలో గిరిజన పోలీస్ అధికారులను ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేస్తూ ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై జోక్యం చేసుకుని గిరిజన పోలీస్ అధికారులకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed