- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమయం ఆసన్నమైంది.. ఆ రోజే కేటీఆర్ పట్టాభిషేకం..?
దిశ, తెలంగాణ బ్యూరో : అంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరుగుతోందా? జనంలోకి ఫీలర్లను వదిలి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారా? అంటే ఔననే జవాబులే వస్తున్నాయి. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ముహూర్తాలను ఖరారు చేశారని సమాచారం. రథసప్తమి రోజున అన్నీ కలిసొస్తాయని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 18న సూర్యుడి జన్మదినంగా చెప్పుకునే రథసప్తమి రోజునే తాను సీఎం పదవి నుంచి తప్పుకుని కొడుకు కేటీఆర్‌కు అప్పజెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారమూ ఫిబ్రవరి 18 కలిసొస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
మాఘపౌర్ణమి ఫిబ్రవరి 27 కూడా మంచి ముహూర్తమని బ్రాహ్మణ పండితులు చెబుతున్న మాట. వాస్తవానికి మే నెల వరకూ మూఢాలు అయినప్పటికీ ఫిబ్రవరి 18, 27 తేదీలలో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 16న వసంత పంచమి కావడంతో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ రోజు సీఎం బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పకపోవచ్చని తెలిసింది. స్పష్టమైన నిర్ణయం తీసుకునే ముందు చినజీయర్ స్వామిని కూడా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో కాకుంటే ఇక ఏప్రిల్ చివరి వరకూ ఆగాల్సిందేనని, అలాంటి పరిస్థితులలో ప్లీనరీని వేదికగా చేసుకుని ప్రకటించాల్సి ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. వీలైన మేరకు రథసప్తమి ముహూర్తాన్నే ఖరారు చేసే అవకాశం ఉంది.
ఆ ముహూర్తం దాటిపోతే, కార్తీక పౌర్ణమి తరహాలో దివ్యమైన దినంగా భావించే మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి 27) ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ రెండూ సంఖ్యా శాస్త్రం ప్రకారం ‘తొమ్మిది’తో ముడిపడి ఉన్నవేనని పండితుల అభిప్రాయం. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు త్వరలో ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అంచనాలు మొదలయ్యాయి. కేబినెట్ మంత్రులతో మొదలైన ఈ చర్చ ఇప్పుడు ఎమ్మెల్యేల దాకా పాకింది. “కేటీఆర్ సీఎం అయితే మాకు అభ్యంతరం లేదు” అని కొందరు, “సీఎంగా కేటీఆర్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి” అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముహూర్తమెప్పుడనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకుని ఆ బాధ్యతలను తన కొడుకైన కేటీఆర్‌కు అప్పజెప్పడం మాత్రం ఖాయమనేది పార్టీ నేతల నిశ్చితాభిప్రాయం.
అంతా గుంభనంగా
యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం తర్వాత అని, ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే ఫిబ్రవరి 17 తర్వాత అని, టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏప్రిల్ చివరి వారంలో ఉంటుంది కాబట్టి దాని తర్వాత అని .. ఇలా రకరకాల అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నా ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి లేదా మాఘపౌర్ణమి ఖరారయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రికి, ఆ బాధ్యతలు చేపట్టబోయే కేటీఆర్‌కు తప్ప ప్రస్తుతానికి ఎవ్వరికీ దానిమీద స్పష్టత లేదు. దాదాపు కొన్ని నెలలుగా అన్ని శాఖలపై సమీక్ష చేస్తూ ‘డీఫ్యాక్టో సీఎం’గా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పుడే భవిష్యత్తులో సీఎం అవుతారన్న సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.
ఇద్దరూ సైలెంట్
ముఖ్యమంత్రి మార్పుపై స్వయంగా మంత్రులే బహిరంగంగా కామెంట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు కూడా వంత పాడుతున్నా అటు కేసీఆర్‌గానీ, ఇటు కేటీఆర్‌గానీ ‘ఔను.. కాదు’ అని ఎక్కడా చెప్పకపోవడం ఈ కామెంట్లకు బలం చేకూరుస్తోంది. కేబినెట్ హెడ్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగానే కేటీఆర్ పేరును ఆ కేబినెట్‌లోని మంత్రులే ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ పెద్దగా కేసీఆర్ కొనసాగుతున్న సమయంలోనే మరొకరిని ‘సీఎం స్థాయికి తగినవారు’, ‘అనుభవం, సామర్ధ్యం ఉంది’, ‘సీఎం కావడంలో తప్పేముంది’ లాంటి వ్యాఖ్యలను మంత్రులే చేయడం కేసీఆర్‌ను అంగీకరించకపోవడమా లేక కేటీఆర్‌ను కోరుకోవడమా అనే ప్రశ్నలకు దారితీసింది.
కేసీఆర్ ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. దీంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకుని కేటీఆర్‌కు అప్పజెప్పడమే మేలనే నిర్ణయానికి వచ్చారా అనే చర్చ జరుగుతోంది. ఎనిమిది మంది మంత్రులు కేటీఆర్‌కు ఇప్పటికే జై కొట్టారు. మంత్రులతో కేసీఆర్ లేదా కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే చెప్పిస్తున్నారా, పార్టీలోని నేతలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారా, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత స్పందన ఎలా ఉంటుందోనని పరిశీలిస్తున్నారా.. టీఆర్ఎస్ నేతలలో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. పార్టీ అధినేతగా, కేబినెట్ హెడ్‌గా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ అంతర్గత వ్యవహారమే అవుతుంది. కేసీఆర్ హెడ్‌గా ఉన్న సమయంలోనే మంత్రులే ఆయనకు బదులుగా మరో నేత వస్తే బాగుంటుందని బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నాడు అలా.. ఇప్పుడిలా
గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిండు సభలో ‘నాకేమైంది. దుక్కలా ఉన్నాను. నా ఆరోగ్యానికీ ఏమీ కాలేదు. బతికున్నంత వరకు నేనే సీఎంగా ఉంటాను’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ సైతం ‘సీఎం కావాలనే కోరికా లేదు. ఆశ అంతకన్నా లేదు. కేసీఆరే సీఎంగా కొనసాగుతారు’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆ ఇద్దరు నేతలూ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత దాదాపు ఏడాది అనంతరం ఇప్పుడు పార్టీ నేతల నుంచి, మంత్రుల నుంచి సీఎం మార్పుపై వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయన్నది గమనార్హం. ముఖ్యమంత్రి మార్పు వ్యాఖ్యలకు కొనసాగింపుగా గతంలో కేసీఆర్ ఒక మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ విషయంలో చేసిన ప్రస్తావన కూడా చక్కర్లు కొడుతోంది.
యుపీఏ-2 హయాంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా సోనియాగాంధీ సరైన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ అదే పొరపాటు చేయకూడదన్న ఉద్దేశంతో కేటీఆర్‌కు సీఎం అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లున్నారు అని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కామెంట్లు వచ్చిన తర్వాత కేసీఆర్ ఇటీవల అస్వస్థతకు గురై యశోద ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఒక వ్యూహమా లేక నిజంగానే ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు రావడంతో బాధ్యతల నుంచి తప్పుకుని కేటీఆర్‌కు అప్పజెప్పాలనుకుంటున్నారా అనేది కూడా పార్టీ నేతల మధ్య చర్చగా మారింది.
తండ్రికి మించిన తనయుడిగా
ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్‌కు అప్పజెప్పడం ఖాయమనేది ఆ పార్టీ నేతలు బలంగా అభిప్రాయపడుతున్నా నిర్దిష్టంగా ఎప్పుడు అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీని గాడిన పెట్టడానికి, ఇకపైన ఓటమి లేకుండా పటిష్టంగా ఉంచడానికి చర్యలు చేపట్టవచ్చన్న వార్తలు వినిపించాయి. సుమారు యాభై నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి వెంటవెంటనే జరిగిపోతాయని పార్టీలు వర్గాలు పేర్కొన్నాయి.
పాలనాపరంగా కూడా భారీ స్థాయిలో మార్పులు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు కూడా అభిప్రాయపడ్డాయి. కానీ ఇవేవీ జరగలేదు. దీంతో కేటీఆర్‌కు బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత ఆయన చేతుల మీదుగా వీటన్నింటినీ అమలుచేయించి ‘తండ్రికి మించిన తనయుడు’ అనే గుర్తింపు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అప్పటివరకూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఉద్యమకారులకు పార్టీలో, ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రాధాన్యత కల్పించడం, కొత్త పథకాలను ప్రకటించడం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్రకటన లాంటివన్నీ వాయిదా వేసే అవకాశాలున్నట్లు సమాచారం. కేటీఆర్ సీఎం అయిన వెంటనే వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రకటనలు చేయడం ద్వారా పాలనలో సమర్ధుడనే అభిప్రాయం కలిగేలా అన్నింటినీ ఇప్పటి నుంచే సిద్ధం చేసి పెట్టినట్లు తెలిసింది.
జమిలి ఎన్నికలు కూడా ఒక కారణం?
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టడం, ఎప్పుడు ప్రకటన వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో’ అనే సందేహాల నడుమ వీలైనంత తొందరగా కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం అనుకున్నట్లుగా జమిలి ఎన్నికలు అనివార్యమైతే 2022 ద్వితీయార్ధం నుంచే నోటిఫికేషన్ల హడావిడి మొదలవుతుంది కాబట్టి కనీసంగా ఏడాదిన్నర, రెండేళ్ళపాటైనా కేటీఆర్ సీఎంగా కొనసాగే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా జాప్యం చేస్తే రాహుల్ గాంధీ పరిస్థితే అవుతుందేమోననే ముందుచూపు కూడా ఇప్పుడు కేటీఆర్‌కు పాలనా పగ్గాలు అప్పజెప్పడానికి ఒక కారణం అని సమాచారం.