ఇండ్లు మేమే గట్టిస్తం..పెండ్లిల్లు మేమే జేస్తం : కేటీఆర్

by Ramesh Goud |
ఇండ్లు మేమే గట్టిస్తం..పెండ్లిల్లు మేమే జేస్తం : కేటీఆర్
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : అర్హులైన వారికి ఇండ్లు మేమే కట్టిస్తం.. పెళ్ళిళ్ళు మేమే జేస్తం అని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అని హామీ ఇచ్చారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాదెపల్లి లో మార్కెట్ యార్డ్ లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.పేదల బతుకులు బాగుండాలంటే పాలకుల ఆలోచనల విధానాలు బాగుండాలి అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. సమైక్య పాలనలో టీడీపీ ప్రభుత్వం 75రూపాయల పించన్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు ఇచ్చి గొప్పగా చెప్పుకుందన్నారు. కొత్త వారికి పించన్లు రావాలంటే సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చేదన్నారు.

సాగు, తాగు నీటికి, కరెంటు కు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు రైతుబంధు, భీమా సౌకర్యం కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసి అన్నదాతలకు తెరాస ప్రభుత్వం అండగా ఉందన్నారు. విద్యార్థుల చదువులకు అండగా నిలుస్తుందన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో ఇప్పటికే 150 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి అయ్యాయని, మరో 1500 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అర్హులైన వారందరికి ఈ ఇండ్లు కేటాయిస్తామన్నారు. స్థలాలు ఉన్న వారు ఇండ్లు కట్టుకొనడానికి ఆర్డిక సహాయం అందిస్తామన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారు. ఇప్పుడు నేను వస్తబిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారని మంత్రి గుర్తు చేసారు. పేదలకు అండగా ఉండడంలో దేశం లో మనరాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందన్నారు. అన్నీ చేస్తున్నాం. పరీక్షలు (ఎన్నికలు) వచ్చినప్పుడు మీరు అండగా ఉంటే మరింత ఉత్సాహంగా పనిచేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి,కలెక్టర్ వెంకట్ రావు,ఎమ్మెల్యేలు లక్ష్మ రెడ్డి ,ఆల వెంకటేశ్వర్ రెడ్డి,రాజేందర్ రెడ్డి ,చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Next Story