కేటీఆర్ బూస్టింగ్ స్పీచ్.. హుజురాబాద్‌పై స్పెషల్ కేర్

by Sridhar Babu |
Minister KTR
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన వారిలో నూతనోత్తేజం నింపేందుకు ప్రయత్నించారు. బై పోల్స్ ఫలితాలను మర్చిపోవాలని, ముందు ఉన్న ఎన్నికల సవాల్‌ను అధిగమించేందుకు ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన స్పీచ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నందున హుజురాబాద్‌ను సందర్శించే అవకాశం లేకుండా పోయిందని, ఇక నుండి తాను ఇక్కడి అభివృద్దిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రకటించారు. ప్రతీ నెల రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి అన్నీ తానై చూసుకుంటానని స్పష్టం చేశారు. హుజురాబాద్‌ను అన్నింటా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఉనికిని చాటుకోవడమే కష్టమని చెప్పారని, అయితే 80 వేలకు పైగా ఓట్లు సాధించుకుని సత్తా చాటామన్నారు.

నియోజకవర్గానికి చెందిన అన్ని శ్రేణులు కూడా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. జనరల్ ఎన్నికల నాటికి హుజురాబాద్‌లో తిరుగులేని శక్తిగా ఎదగడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. సుమారు 2 గంటల పాటు మంత్రి కేటీఆర్ హుజురాబాద్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయి పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed