టీఆర్ఎస్ పాలన అంతానికి పోరాటం చేద్దాం

by Shyam |   ( Updated:2021-08-05 21:08:24.0  )
Congress leader Dasoju Shravan
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పాలన అంతమై ప్రజాపాలన వచ్చేవరకు పోరాటం చేద్దామని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు ప్రజలకు పిలుపు నిచ్చారు. గురువారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ దళిత బంధు పథకంపై మాట్లాడుతున్న సమయంలోనే ఎల్బీనగర్‌లో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మాన్యువల్ స్కావెంజర్ పనుల్లో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మృతి దురదృష్టకరమన్నారు.

గతంలో కేటీఆర్ హైదరాబాద్‌లో మాన్యువల్ స్కావెంజర్ పనులు లేవని ప్రకటించారని, మరి ఇద్దరు కార్మికులు ఎలా మృతిచెందారని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేలో జరగాల్సిన డి సిల్టింగ్ పనులు ఇప్పటి వరకు పెండింగ్ ఎందుకు ఉన్నాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల మృతికి కేటీఆర్ పూర్తి బాధ్యత వహించాలని, డి సిల్టింగ్ పనుల్లో రెండు శాఖల మునిసిపల్, వాటర్ వర్క్స్ మధ్య సమన్వయం లేదని ఆరోపించారు.

డి సిల్టింగ్ పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు, అధికారులు అక్రమాలకు పాల్పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కావెంజర్ పనులు చేసే వారికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొనే వస్తువులు అందించాలని, ఇద్దరు కార్మికుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న హైదరాబాద్ లో ఎందుకు అభివృద్ధి పనులు చేయడం లేదో ప్రజలకు వివరించాలన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న వారు ఎక్కడికక్కడ పోరాటం చేద్దామని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రులను నిలదీయాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ల్యాండ్, సాండ్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలతో పందికొక్కుల్లాగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ దుర్మార్గపు పాలనలపై పోరాటం చేద్దామని, మంత్రులు, ఎమ్యెల్యేలపై ప్రజా చార్జిషీట్ తీద్దామన్నారు.

Advertisement

Next Story

Most Viewed