ఎంఎస్ఎంఈలకు కేంద్రం అండగా నిలవాలి : కేటీఆర్ లేఖ

by Shyam |
KTR Nirmala seetharaman
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు సహాయ, సహకారాలు అందించాలని బుధవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరోనాపై పరిమితులు సడలించడం, పెరుగుతున్న ఎకనామిక్ ఆక్టివిటీ మొదలైన అంశాలతో నాల్గొవ త్రైమాసికంలో ఎంఎస్ఎంఈ పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమన్నారు. గత 5 శతాబ్దాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు విస్తరించి ఉన్నాయన్నారు. కరోనా, లాక్డౌన్ తో ఈ ఎంఎస్ఎంఈలు గతేడాది నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయని, దీంతో వాటి పరిస్థితి దీనంగా మారిందన్నారు.

పరిశ్రమల కార్యకలాపాలపై లాక్డౌన్ సమయంలోనూ తెలంగాణ ఎలాంటి పరిమితులు విధించలేదని, అయితే ఈ ఎంఎస్ఎంఈలకు అవసరమైన ముడి సరుకుల సరఫరా ఇతర రాష్ట్రాల నుంచి రాకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు తిరిగి వెళ్లారన్నారు. దీనికి తోడు ఎంఎస్ఎంఈలు తయారు చేసిన తమ ఉత్పత్తులను తమ కస్టమర్లకు అందించడంలో ఎదుర్కొన్న రవాణా ఇబ్బందులతో వాటి కార్యకలాపాలు స్తంభించాయన్నారు.

ఎలాంటి రాబడులు లేని సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలు రుణాల చెల్లింపు పై వచ్చే ఏడాది మార్చి 31 వరకు మారటోరియం విధించాలని, రుణాల పై వడ్డీ మాఫీ చేయడం వంటి చర్యలు తీసుకుంటే ఆయా ఎంఎస్ఎంఈలకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. కేంద్రం నుంచి మద్దతు అందించగలిగితే కరోనా కన్నా ముందు ఉన్న పూర్వస్థితికి ఎంఎస్ఎంఈలు చేరుకుంటాయన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

Advertisement

Next Story