‘కంపు’ రాజకీయాలకు తెర.. కేటీఆర్ భయపడ్డారంటున్న విపక్షాలు

by Anukaran |
‘కంపు’ రాజకీయాలకు తెర.. కేటీఆర్ భయపడ్డారంటున్న విపక్షాలు
X

దిశ, సిరిసిల్ల: కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వతంత్రంగా వేయాల్సిన ఓటు హక్కును ప్రలోభాలకు గురి చేసి.. తమ అభ్యర్థికి ఓటు వేయాలని సిరిసిల్ల ప్రజాప్రతినిధులతో క్యాంపు రాజకీయాలకు అధికార పార్టీ తెరలేపింది. కాగా ఓట్లు దండుకోవడానికి చేసిన ఈ ఎమ్మెల్సీ “కంపు” రాజకీయానికి ఎట్టకేలకు శుక్రవారం తెరపడింది. అయితే ఈ క్యాంపు రాజకీయం సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామంటూ అనేకమార్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు దక్కించుకునేందుకు వ్యయ ప్రయాసలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే.. మరోవైపు సొంత నియోజకవర్గ ప్రజాప్రతినిధులను క్యాంపులో పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసారని ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేటీఆర్ గ్రాఫ్ తగ్గుతోందని అందుకే ఆఫర్లు ఇస్తూ నాయకులను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

ప్రత్యర్థులు ఉంటేనే తమకు విలువ..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఓటు వేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. సిరిసిల్ల జిల్లాలో మెజారిటీ ప్రజా ప్రతినిధులు అందరూ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందినవారే అందులోనూ కేటీఆర్‌ను అందరూ అభిమానించేవారే. అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు ఓట్లను చీల్చి ఒకానొక సమయంలో గెలుపు గుర్రాలు ఎక్కుతారనే భయంతో టీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా క్యాంపు రాజకీయాలను నిర్వహించింది. సొంత గూటిలోని కొన్ని అసంతృప్తి గువ్వలు బయటకు వెళ్లే అవకాశాలు అధికంగా ఉండడంతోనే ఇలాంటి చర్యలకు దిగినట్లు ప్రతిపక్ష నాయకుల్లో చర్చ జోరందుకుంది. ఏ ఎన్నికలకైనా, ఏ పోటీ కైనా ప్రత్యర్థులు ఉంటేనే తమకు విలువని క్యాంపునకు వెళ్లి వచ్చిన కొందరు అధికార పార్టీ నాయకులు సన్నిహితులతో చెప్పుకోవడం గమనార్హం. జిల్లాలో 201 మంది ఓటర్లు ఉండగా అందులో దాదాపు 180కి పైగా ఓటర్లు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇంత మెజారిటీ స్థాయిలో ఓటర్లు ఉన్న మళ్లీ ఓడిపోతామనే భయం కేటీఆర్‌లో నెలకొందని విపక్షాలు జోరుగా చర్చ సాగిస్తున్నాయి.

Advertisement

Next Story