మా మౌనాన్ని తక్కువ అంచనా వేయొద్దు.. నేను తుపాకీని : కేటీఆర్

by Anukaran |
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ఒంటరిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఇప్పుడు లక్షలాది మందితో సైన్యాన్ని తయారుచేశారు. రాష్ట్రాన్ని సాధించారు. ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా కొద్దిమంది ఇప్పుడు రాజకీయంగా అవాకులు చెవాకులు పేలుతున్నారు. మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. తక్కువ అంచనా వేయొద్దు. గోడకు వేలాడుతూ ఉండే తుపాకీ ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దాని పవర్ ఏంటో తెలుస్తుంది” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

“ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ పార్టీకి రెండు దశాబ్దాల వయసు పూర్తవుతుంది. కేసీఆర్ తన 40 ఏండ్ల నడి వయసులో పార్టీని ప్రారంభించారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీకి బలమైన చరిత్ర ఉంది. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలమైన వ్యవస్థగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటికే జరిగిన ఉద్యమాలు విఫలమయ్యాయి. ఒక వ్యక్తిగా కేసీఆర్ మెదక్ జిల్లా ప్రజలకు మాత్రమే తెలుసు. మనీ పవర్ లేదు. మజిల్ పవర్ అంతకన్నా లేదు. మీడియా బలమూ లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ ఒక్కడిగా తన రాజకీయ ప్రయాణాన్ని రాష్ట్రాన్ని సాధించాలన్న ఏకైక లక్ష్యంతో మొదలుపెట్టారు. ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలతో బలమైన సైన్యంగా తయారైంది” అని తన ప్రసంగంలో కేటీఆర్ పేర్కొన్నారు.

లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్ళతో కొట్టి చంపండి అని దమ్మున్న నేతగా కేసీఆర్ స్టేట్‌మెంట్ ఇచ్చారని, తెలంగాణ ఉనికినే హేళన చేసిన పరిస్థితుల్లో కుంగిపోకుండా ముందడుగు వేశారని కేటీఆర్ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం విఫలమైన పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగించడానికి తన పదవులను సైతం గడ్డిపోచలా త్యాగం చేశారని గుర్తుచేశారు. ఎంతో మంది సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అని గర్వంగా ప్రకటించారు. విద్యార్థులు ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీల్లో చదువుకుంటే బీజేపీ నేతలు మాత్రం వాట్సాప్ యూనివర్సిటీలో అబద్దాలు నేర్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేసీఆర్ మౌనాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయొద్దని, అవసరం వచ్చినపుడు బఫూన్ల భరతం పడతారన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో అనేక అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌దని, గురుకుల పాఠశాలలు, కాలేజీలను ఎన్నో రెట్లు పెంచుకున్నామన్నారు. కొందరు సన్నాసులు మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ విద్యారంగానికి చేసింది గుండు సున్న మాత్రమేనన్నారు. తెలంగాణకు ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ఐటీ లాంటి సంగతేమోగానీ కనీసం నవోదయ విద్యాలయాలను కూడా ఇవ్వలేదన్నారు. దేశమంతా మెడికల్ కాలేజీలు పెట్టినా తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని, ఏం చూసి బీజేపీకి ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని, విశాఖలో ఉన్నదాన్నే మూసేస్తుంటే ఇక బయ్యారం ప్లాంట్ ఇస్తుందనే ఆశలేదన్నారు.

పకోడీలు అమ్ముకుంటున్నవారిని చూపించి ఉపాధి అవకాశాలు కల్పించామని ప్రధాని మోడీ చెప్పుకుంటారని, మాటలు కోట్లల్లో ఉంటే చేతలుమాత్రం పకోడీల్లో ఉంటాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ సాధించిన విజయాలు, బీజేపీ నేతల పసలేని మాటలు, చేసిన నిర్వాకాన్ని పట్టభద్రులకు అర్థం చేయించి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed