హుజురాబాద్‌లో ప్రచారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by  |   ( Updated:2021-10-19 02:06:58.0  )
ktr-12
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన నాగార్జున సాగర్, దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా తాను వెళ్లలేదన్నారు. 119 నియోజకవర్గాల్లో ఒకటి హుజురాబాద్ అని, అది ఒక చిన్న ఎన్నిక అన్నారు. నూరుశాతం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాతీర్పుకు ప్రతిబింబం ఎన్నికలు అన్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా నూరుశాతం టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జానారెడ్డినే చిన్న వయస్సు ఉన్న నోముల భగత్ ఓడించాడని, జానారెడ్డి కన్నా ఈటల పెద్దనాయకుడు కాదన్నారు. ఈటల బీజేపీలో చేరిన దగ్గర నుంచి జై బీజేపీ, జై శ్రీరాం, జై మోడీ అనలేదని, కేవలం జై ఈటల మాత్రమే అంటున్నారని దుయ్యబట్టారు. జై బీజేపీ అంటే కేంద్రం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు ఓటు వేయరని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 17 ఏళ్లు టీఆర్ఎస్ లో కొనసాగిన ఈటలకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల గెలిస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ గెలిస్తే నిరంతరాయంగా అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.

దళితబంధును ఆపలేరని, అది ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. నవంబర్ 3 నుంచి తిరిగి కొనసాగుతుందని కేటీఆర్ వెల్లడించారు. నాలుగు మండలాలకు రూ.250 కోట్లను సోమవారం విడుదల చేశామని వెల్లడించారు. ఈటల బీజేపీలో చేరగానే మతిమరుపు వచ్చిందన్నారు. నవంబర్ 15న తర్వాత తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. డీఎంకే, ఏడీఎంకే పార్టీలు సంస్థాగతంగా ఎలా పటిష్టమయ్యాయి. అందుకు ఆ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు పటిష్టతకు నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌లో త్వరలోనే గ్రూపు రాజకీయాలు లేకుండా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం అని కొట్టిపారేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయని.. ఇది వెయ్యిశాతం వాస్తవం అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తార‌ని వినిపిస్తోందన్నారు. దళితబంధు ఎన్నికల కోసమే అనుకుంటే వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 93 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, నవంబర్ 15 నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed