అన్నా.. 2 రోజులు ఆగవే

by Anukaran |
అన్నా.. 2 రోజులు ఆగవే
X

– తీగలకు కేటీఆర్ హితవు

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి మళ్లీ అభయమొచ్చింది. రెండేండ్లుగా అధిష్ఠానం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఉన్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, ఆ పార్టీలోకి వెళ్లారని అన్నట్లుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇదే వార్త ‘దిశ’లో ట్రెండింగ్ అయ్యింది. ఈ క్రమంలో తీగల పార్టీ బదలాయిస్తారని గుర్తించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రంగంలోకి దిగారు. శుక్రవారం తీగల కృష్ణారెడ్డి వియ్యంకుడు మంత్రి చామకూర మల్లారెడ్డిని పంపారు. మీర్ పేటలోని తీగలకు చెందిన టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోనే కలిశారు. పార్టీని వీడొద్దు బావా.. మల్లారెడ్డి నచ్చజెప్పారు. నాకు పార్టీ తీరని అన్యాయం చేసిందంటూ వాపోయినట్లు తెలిసింది. వైస్సాఆర్ సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న సబితారెడ్డిని గెలిపించారని ఆరోపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పైగా ఆమెను టీఆర్ఎస్ లోకి తీసుకోవడం, మంత్రి పదవిని కట్టబెట్టడంతో తన అనుచరగణం ఇబ్బందులకు గురైనట్లు ఏకరవు పెట్టినట్లు సమాచారం. చాలా సేపు చర్చించినా మెట్టు దిగని తీగలను మంత్రి మల్లారెడ్డి తన ఫోన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడించారు. అన్నా.. నిన్ను పట్టించుకోని మాట నిజమే. రెండు రోజులు ఆగవే. త్వరలోనే మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పార్టీ మారే ఆలోచన చేయొద్దని సూచించారు. తీగలతో గంటలకొద్దీ చర్చించిన మంత్రి మల్లారెడ్డి ఆయన వెంటబెట్టుకొని దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి దశదిన కర్మలకు వెళ్లడం గమనార్హం. దాంతో తీగలకు ఉపశమనం లభించింది.

ఇంట్లో రెండు మాటలు

తీగల కృష్ణారెడ్డి పార్టీ మారే యోచనపై ఆయన ఇంట్లోనే రెండుగా చీలిపోయాయన్న ప్రచారం జరుగుతోంది. ఇన్నాండ్లుగా తమను పట్టించుకోనప్పుడు పార్టీ మారాల్సిందేనని ఒక కొడుకు బలంగా వాదిస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇబ్బంది జరుగుతుందంటూ మరో కొడుకు చెబుతున్నారు. ఐతే కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బీజేపీలో చేరడంపై కొద్ది రోజులుగా తర్జనభర్జన జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ అభయం ఇవ్వడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story