కేవలం రూపాయి మాత్రమే తీసుకునే యాచకుడి అంత్యక్రియలు.. వేలాదిగా తరలివచ్చిన జనం

by Shamantha N |   ( Updated:2021-11-17 03:59:44.0  )
beggar-1
X

దిశ, వెబ్ డెస్క్: భిక్షాటన చేసుకునే వారి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే, వారు చనిపోతే అక్కడున్న స్థానికులో లేదా స్వచ్ఛంద సంస్థలో లేదా ప్రభుత్వ సిబ్బందో ఇలా ఎవరో ఒకరు వారి అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ, కర్ణాటకలో మాత్రం భిక్షాటన చేసుకునే ఓ వ్యక్తి మృతిచెందితే అతడి అంత్యక్రియలకు వేలాదిమంది జనం తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్ లో వైరలవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. హుచ్చ బస్యా (45) అనే వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతను మానసిక వికలాంగుడు. అయితే, ఇతనికి, కర్ణాటకలోని హడగళి పట్టణ ప్రజలతో ప్రత్యేక అనుబంధముంది. బస్యాకు డబ్బులు దానంగా ఇస్తే అతను అందులో నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగిలినమొత్తాన్ని తిరిగి వారికే ఇచ్చేసేవాడు. ఎక్కువ డబ్బులు తీసుకోమని ప్రజలు బలవంతం చేసినా అతను నిరాకరించేవాడు. అంతేకాదు.. బస్యాకు దానం చేస్తే తమకు మంచి జరుగుతదని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే అతడిని గౌరవంగా చూసేవారు. అయితే, అతను రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అంతేకాదు.. నగరమంతటా ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పిస్తూ బ్యానర్లు కట్టారు. బ్యాండ్ వాయిద్యాలతో అతని మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ వైరలవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు “అతను భిక్షాటన చేస్తూ జీవించాడు. కానీ.. మరణం అతన్ని హీరోని చేసింది. మంచి పనులకు లౌడ్‌స్పీకర్లు అవసరం లేదు. RIP నోబుల్ సోల్”, ‘మానవత్వం ఇంకా ప్రబలంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story