- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జల వివాదాల్లో కొత్త కోణం.. రెండు రాష్ట్రాల ప్రీ ప్లాన్ ఇదేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జల వివాదాల్లో రెండు రాష్ట్రాల ప్రీ ప్లాన్ మరింత బలపడుతోంది. జల వివాదం మళ్లీ కోర్టుకెక్కింది. కోర్టులో పిటిషన్ఉండగా ఎటూ తేల్చలేమని స్పష్టం చేయడంతో తెలంగాణ పిటిషన్ఉపసంహరించుకున్న దరిమిలా… కేంద్రాన్ని కాదంటూ ఏపీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జల వివాదాలు ఇక కొనసాగినట్టేనని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాలు సమిష్టి వ్యూహంతో ఈ జల రాజకీయాలకు దిగుతున్నాయనే విమర్శలున్నాయి. కోర్టులో పిటిషన్లతో ఏండ్ల తరబడి వివాదం సాగుతుందని, దీంతో రెండు రాష్ట్రాల్లో జల వివాదాలను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఇద్దరూ ఒప్పుకున్నారు
గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు జల వివాదాలపై ఒప్పందానికి వచ్చినట్లే చేశారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంత వాదనలను బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వినాలని, ఒక నీటి సంవత్సరంలో వినియోగించుకోని వాటానీటిని కొత్త ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగిన అపెక్స్‌లో జల వివాదాల పరిష్కారాన్ని ట్రిబ్యునల్‌కు బదలాయించాలన్నారు.
అయితే ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని కేంద్ర మంత్రి పేర్కొనడంతో.. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే వివాదాలను ప్రస్తుత ట్రిబ్యునల్‌కు అప్పగించడం లేదా కొత్త ట్రిబ్యునల్‌కు బదలాయించి పరిష్కరించడంపై నిర్ణయం తీసుకుంటామని, ఇందుకు ఇరు రాష్ట్రాలు ఒప్పుకోవాలంటూ సూచించారు. దీంతో తాము పిటిషన్‌ను ఉపసంహరించుకొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించి, గత నెల 9న పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీన్ని ఉపసంహరించుకున్నట్లు కేంద్రానికి సైతం లేఖ రాసింది.
సుప్రీం కోర్టులో ఏపీ పిటిషన్
ప్రస్తుతం జల వివాదాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు చేస్తున్నాయి. కానీ వ్యూహాత్మకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే తెలంగాణ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కానీ ఏపీ మాత్రం మళ్లీ అత్యున్నత న్యాయస్థానికెక్కింది. దీంతో ఏపీ- తెలంగాణ జలవివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఏపీ పిటిషన్ వేసింది. కృష్ణా నదీజలాలు, నీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ అనుసరిస్తున్న వైఖరి చట్ట విరుద్ధమని, ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. కృష్ణా బోర్డును నోటిఫై చేసేలా ఆదేశివ్వాలని కోర్టును కోరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నియంత్రణ ఉండాలని పిటిషన్‌లో పేర్కొంది.
ధిక్కరణ పిటిషన్ మరోవైపు..!
ఈ వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ సుప్రీం కోర్టుకు కాకుండా ఎన్జీటీని ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై గవినోళ్ల శ్రీనివాస్అనే సామాజిక కార్యకర్త ఎన్జీటీలో పిటిషన్ వేశారు. కొంతకాలం ఈ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏపీపై ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో ఏపీపై మాత్రమే ఆరోపణలు చేసింది. కానీ ఏపీ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో కేంద్రాన్ని కూడా చేరింది.
వ్యూహాత్మకమేనా..?
ఒక రాష్ట్రంలో ఉపసంహరించుకోవడం… ఆ వెంటనే అదే సాకును చూపిస్తూ ఇంకో రాష్ట్రం మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకమైన రాజకీయమేనంటూ చెప్పుతున్నారు. సుప్రీం కోర్టులో పిటిషన్‌తో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణగడం కష్టమేనని, దీంతో సెంటిమెంట్‌ను రగిలించుకుని రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్ధి పొందుతారని ఆరోపణలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర వైఖరికి వ్యతిరేకంగా ఏపీ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జల వివాదాలపై ఇరు ప్రభుత్వాలు ఒక ఒప్పందం ప్రకారం… ముందస్తు వ్యూహం ప్రకారం అడుగులేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా సుప్రీం కోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకునే సమయంలో తెలంగాణ స్పష్టమైన వైఖరి చెప్పింది. జల వివాదాలు పరిష్కరించకుంటే కోర్టులో మళ్లీ పిటిషన్ వేస్తామని ముందుగానే చెప్పింది. కానీ ఇప్పుడు దానిపై తెలంగాణ ముందుకెళ్లడం లేదు.
కేంద్రం ఏం చేస్తోంది
తాజా పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుని ఎలాంటి చొరవ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కోర్టు విచారణ రాకముందే కేంద్రం పలు సూచనలు చేయడంతో పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటే సమస్య పరిష్కారమౌతోందని ప్రతిపక్షాలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇరు రాష్ట్రాల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. జలాల వివాదం విషయంలో కేంద్రం వైఖరిని కోర్టు ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కానీ కేంద్రం ఇప్పటికే జల వివాదాలపై జోక్యం చేసుకునేందుకు ఒక అడుగు ముందు… నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాయలసీమ పనుల పరిశీలనకు వెళ్లాలని కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీకి సూచించినా… మళ్లీ దానిపై ఎలాంటి ఆదేశాలివ్వడం లేదు. నిపుణుల కమిటీ కూడా కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర బృందం రక్షణ ఉంటే ఎప్పుడైనా వెళ్తామంటూ చెప్పింది. కానీ కేంద్రం దీనిపై తిరుగు సమాధానం పంపించలేదు. దీంతో కేంద్ర వైఖరిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి రెండు నెలలకుపైగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నా.. కేంద్ర ప్రభుత్వ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ వస్తోంది. రెండు రాష్ట్రాలు కేంద్రానికి వరుసగా లేఖలు రాసినా ఢిల్లీ నుంచి స్పందన లేదు. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో కేంద్రం కూడా స్పందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఏపీ పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు తెలంగాణతో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేస్తే.. కేంద్రం తప్పనిసరిగా తన వైఖరి ఏంటో చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న అంశంపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ తీరువల్లే సుప్రీంకు వెళ్లాల్సి వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఇది ఖచ్చితంగా రాజకీయమే..
దక్షిణ తెలంగాణకు అన్యాయం చేయడం, నీళ్ల సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయడం రెండు రాష్ట్రాల సీఎంలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకు అదే అంశంతో ముందుకు పోతున్నారు. ఎందుకంటే నీళ్ల సెంటిమెంట్అనేది వాళ్లకు ఓట్ల రూపంలో కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇద్దరూ కలిసికట్టుగా రాజకీయం చేస్తున్నారు. 2020లోనే రాయలసీమ కడుతున్నారంటూ మేమంతా నెత్తికొట్టుకుని చెప్పితే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వ్యూహాత్మకంగా జల వివాదాలను సృష్టిస్తున్నారు. ఇప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఈ వివాదం సాగుతూనే ఉంటుంది. అందుకే తెలంగాణ సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటే… ఏపీ మళ్లీ పిటిషన్ వేసింది.
-చల్లా వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కల్వకుర్తి