ఆ ఊరికి వందేళ్లుగా సంక్రాంతి పండుగ లేదు

by Shyam |
ఆ ఊరికి వందేళ్లుగా సంక్రాంతి పండుగ లేదు
X

దిశ, మక్తల్: వంద సంవత్సరాలుగా ఆ గ్రామానికి సంక్రాంతి పండుగ లేదు. అంతేకాదు 11 రోజుల పాటు గ్రామస్తులు సంతాప దినాలు పాటిస్తారు. తలకు నూనె పెట్టుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బూజు దులుపుకోవడం ఇలా ఏమీ చేయరట.. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్ర ప్రజలు ఆ వింత ఆచారాన్ని వందేళ్ల నుంచి పాటిస్తున్నారు. వందేండ్ల కిందట ఈ ప్రాంతంలో శైవ మత సిద్ధ గురువు క్షీరలింగేశ్వర స్వామి ధర్మ ప్రచారం చేస్తూ.. తన మహిమలతో ప్రజలకు కష్టాలను తొలగించే వాడని, ఆయనను సేవించిన వారికి అంతా మంచే జరిగేదని చరిత్ర చెబుతోంది.

ఆ గురువు మాటలు ఇక్కడి ప్రజలకు వేద వాక్కు.. ఒక రోజు ఆ గురువు అందరిలా తనకు మరణం ఉండదని.. మకర సంక్రాంతి ఉత్తరాయణం మొదటిరోజు జీవసమాధి అవుతానని చెప్పారట. తన పేరు మీద కృష్ణ గ్రామంలో క్షీర లింగేశ్వర మఠాన్ని నిర్మించి తన జీవసమాధి రోజున రథోత్సవం నిర్వహించాలని.. జీవ సమాధి నుంచి పదకొండు రోజుల వరకు పుణ్యతిథి రోజులను గ్రామ ప్రజలు పాటించాలని చెప్పినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి నేటి వరకు కృష్ణ గ్రామ ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోరు. సంక్రాంతి పండుగ 11 రోజుల తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని పండుగను నిర్వహించుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed