హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మహిళా నాయకురాలు?

by Shyam |   ( Updated:2021-08-17 23:30:43.0  )
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మహిళా నాయకురాలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్​ ఉప ఎన్నిక రాష్ట్రంలో కీలక పరిణామాలు.. అనూహ్య నిర్ణయాలకు వేదికవుతున్నది. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ మినహా మిగతా పార్టీల్లో ఊహించని వారికి టికెట్లు దక్కుతున్నాయి. అధికార టీఆర్​ఎస్​ నుంచి గెల్లు శ్రీనివాస్​కు అవకాశం దక్కింది. ఇప్పుడు కాంగ్రెస్​ నుంచి కొండా సురేఖ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొండా సురేఖకు హుజూరాబాద్​ ఉప ఎన్నిక టికెట్​ ఇచ్చేందుకు అధిష్ఠానం దాదాపుగా నిర్ణయం తీసుకున్నది. బుధవారం జరిగే రావిర్యాల సభా వేదిక పైనుంచి ప్రకటన చేస్తారని హస్తం నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో విశ్లేషణ మొదలైంది. టీఆర్​ఎస్​ వ్యతిరేకత ఓట్లు, కాంగ్రెస్​ ఓటు బ్యాంకుతో పాటుగా ఈ ప్రాంతంలోని మావోయిస్టు మాజీల మద్దతు వస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ మాజీల మద్దతుపై ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈటల వెంట ఉన్న వారంతా.. బీజేపీ జెండాను చూసి కొంత వెనక్కి తగ్గుతున్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్​ వాడుకుంటే.. గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషిస్తున్నారు.

అంచనాలు.. ఆశలు

హుజూరాబాద్​లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​కు అనుకూలంగా ఉందంటూ చెప్తున్న పరిణామాల్లో అధికార పార్టీ దూకుడు పెంచింది. టీఆర్​ఎస్​ కూడా బీసీ అభ్యర్థిని దింపింది. దళిత బంధును ప్రారంభించారు. ఈ సమయంలో అనూహ్యంగా కొండా సురేఖ పేరును కాంగ్రెస్​ తెరపైకి తీసుకువచ్చింది. దీనిపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ ఠాగూర్​ కూడా చర్చించారు. అటు కొండా దంపతుల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీ నిర్ణయమే తన నిర్ణయమంటూ అనుకూల సంకేతాలిచ్చారు. దీంతో కాంగ్రెస్ నుంచి కొండా సురేఖను దింపుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కొండా దంపతులు గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి పరకాల నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగిన ఆమె చల్లా ధర్మారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ అక్కడి నుంచి పోటీ చేయకుండా పరకాల నియోజకవర్గం నుండి పోటీకి దిగారు. టీఆర్ఎస్ అధికార పార్టీ కావటంతో కాంగ్రెస్ మొన్నటివరకు అంపశయ్య మీద ఉండటంతో స్థానికంగా పట్టు పెంపొందించుకోవడానికి కూడా వీలుకాని పరిస్థితుల్లోనూ కొంత పోటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో రేవంత్​రెడ్డి టీపీసీసీ రావటంతో రాజకీయంగా పుంజుకునే యత్నం చేస్తున్నారు. కొంతకాలం కిందట వరకు కాంగ్రెస్​లో కూడా జోష్​ లేకపోవడంతో కొండా దంపతులు సైలెంట్​ అయ్యారు. ప్రస్తుతం రేవంత్ రాకతో తిరిగి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కొండా దంపతులు ముందుగానే రేవంత్‌కు మద్దతు ప్రకటించి, రేవంత్ నాయకత్వంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి కొండా సురేఖ దిగుతారనే వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్​గా మారింది.

కలిసి వస్తే బోనస్​

హుజూరాబాద్​ సెగ్మెంట్​లో కాంగ్రెస్​ పార్టీ గతంలో 61 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నది. ఇందులో దాదాపు 60 శాతం హస్తం గుర్తు ఓటు బ్యాంకు. మిగిలినవి అప్పుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్​కు వ్యతిరేకంగా పడిన ఓట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీఆర్​ఎస్​, బీజేపీ అన్నట్టుగా పోరు సాగుతున్నా.. కాంగ్రెస్​ మాత్రం సైలెంట్​గా అడుగులేస్తున్నది. కొండా సురేఖను పోటీకి దింపితే అటు పద్మశాలి, ఇటు మున్నూరుకాపు వర్గాల మద్దతు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఈ రెండు వర్గాల ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. కొంత బీసీల ఓట్లు కూడా అనుకూలించి, కాంగ్రెస్​ ఓటు బ్యాంకు కూడా నమోదైతే అనూహ్య విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్నికలు… రాజకీయ వ్యూహాలు వేయడంలో కొండా దంపతులకు ప్రత్యేక పేరు కూడా ఉంది. అలాంటి పరిస్థితులు ఇక్కడ పని చేస్తే కొంత చాన్స్​ ఉందని కూడా చెప్పుకుంటున్నారు.

‘మాజీ’ల మద్దతుపై కూడా..!

హుజూరాబాద్​ నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషించనున్న మాజీల మద్దతుపై కాంగ్రెస్​ పార్టీ ఆశ పెట్టుకున్నది. ఈ సెగ్మెంట్​లో దాదాపు 60 శాతం వరకు గతంలో మావోయిస్టు పార్టీలో పని చేసినవారు, ఇన్​ఫార్మర్లు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు ఈ ప్రాంతంలోని గ్రామాల్లో ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులుగా, చోటామోటా లీడర్లుగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్​కు, ఆ తర్వాత టీడీపీకి అనంతరం టీఆర్​ఎస్​కు మద్దతుగా నిలిచారు. ఈటల రాజేందర్​ కూడా అదే కోవకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు బలంగా నిలిచారు. కానీ ప్రస్తుతం ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం మాజీలను ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడేస్తోంది. కాషాయం కండువా, జై శ్రీరాం నినాదాలకు దూరంగా ఉండే వీరంతా ఇప్పుడు ప్రత్యమ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే టీఆర్​ఎస్​లో పరిస్థితి ఆశించినంతగా లేకపోయినా.. తప్పలేక కొనసాగుతున్నారు. ఒకవేళ ఇప్పుడు కొండా సురేఖ హుజూరాబాద్​ నుంచి పోటీకి దిగి, రేవంత్​రెడ్డి ప్రచారబాధ్యతలను మీదేసుకోవడం, గట్టి ప్రయత్నాలు చేస్తే మాజీల ఓట్లు కూడా కాంగ్రెస్​ వైపు మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Next Story