ఆ బౌలర్‌తోనే కోల్‌కతా ‘సూపర్’ విన్

by Anukaran |   ( Updated:2020-10-18 09:16:50.0  )
ఆ బౌలర్‌తోనే కోల్‌కతా ‘సూపర్’ విన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్35 మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా అనూహ్య విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు మాత్రమే పరిమితం కావడంతో లాకీ ఫెర్గూసన్ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని తొలి మూడు బంతుల్లోనే 2 వికెట్లు తీశాడు.

డేవిడ్ వార్నర్‌ను తొలి బంతికే క్లీన్ బోల్డ్ చేశాడు ఫెర్గూసన్. ఆ తర్వాత సమద్ రెండో బంతికి రెండు పరుగులు చేశాడు. ఇక మూడో బంతిని ఉపేక్షించని ఫెర్గూసన్ సమద్‌ను కూడా ఔట్ చేశాడు. దీంతో సూపర్ ఓవర్ అవకాశంలో హైదరాబాద్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది.

సూపర్‌ ఓవర్‌లో 3 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి వచ్చిన కోల్‌కతా 4 బంతుల్లోనే 3 పరుగులు చేసి గెలుపొందింది. ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ ఇద్దరు కలిసి సూపర్ ఓవర్‌లో క్రీజులోకి వచ్చి జట్టును గెలిపించుకున్నారు. దీంతో 9 మ్యాచులు ఆడిన కేకేఆర్ 5 విజయాలు, 4 పరాజయాలను నమోదు చేసుకుంది. ముఖ్యంగా కోల్‌కతా జట్టులోని లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన లాకీ ఫెర్గూసన్‌ ఆ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చాడు.

లాక్ చేసిన ఫెర్గూసన్: ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా జట్టులో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫెర్గూసన్ అత్యంత ప్రమాదకరంగా మారాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ల పై తన బౌలింగ్ ప్రతిభను చూపిస్తూ వెన్నులో వణుకు పుట్టించాడు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 4 ఓవర్లు వేసిన ఫెర్గూసన్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో కూడా 3 బంతుల్లో 2 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి.. విజయాన్ని తమ వైపు మలుచుకున్నాడు. ఫెర్గూసన్ రాకతో రాబోయే మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి పై చింత లేకుండా పోయిందని క్రికెట్ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed