స్మార్ట్ టీవీల కోసం రూ. 300 కోట్ల పెట్టుబడులు

by Harish |
స్మార్ట్ టీవీల కోసం రూ. 300 కోట్ల పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కొడాక్ స్మార్ట్ టీవీ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఆర్అండ్‌డీ సదుపాయాల కోసం రూ. 300 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. 3 ఏళ్లలో దశలవారీగా, సరికొత్త టీవీలను ఉత్పత్తి చేయడం, దేశీయ వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడంపై ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కరోనా మహమ్మారి తర్వాత టీవీల వినియోగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2023 నాటికి భారత మార్కెట్లో 10 లక్షల కంటే ఎక్కువ స్మార్ట్ హోమ్ పరికరాలు ఉంటాయని అంచనా. ఈ అంశాలను గుర్తించి వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలకు అనుగుణంగా కొడాక్ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా ఆర్అండ్‌డీ కేంద్రంలో కార్యకలాపాలు మొదలవుతాయని ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, సీఈఓ అవనీత్ సింగ్ మార్వా చెప్పారు. ‘ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, త్వరలో ఇంజనీర్లను నియమించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. చిప్‌సెట్, కోడింగ్‌పై పనిచేసే సాంకేతిక నిపుణులు ఇక్కడ పనిచేస్తారని’ ఆయన వివరించారు.

Advertisement

Next Story