ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి వచ్చావా.. ఈటలపై ‘కిషన్ రెడ్డి’ సంచలన లేఖ

by Sridhar Babu |
Eatala Rajender Bjp
X

దిశ, హుజురాబాద్ : స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహరశైలి నాకు నచ్చడం లేదు. తన ప్రచారంలో ప్రధాని మోడీకి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న (బండి సంజయ్) మీకు ప్రాధాన్యం కల్పించడంలేదనే బాధతో బీజేపీకి రాజీనామా చేస్తున్నాను అంటూ హుజురాబాద్ ఇంఛార్జి పోరెడ్డి కిషన్ రెడ్డి తన రాజీనామా లేఖలో వివరించారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఈ మేరకు రాజీనామా లేఖను పంపించారు. అందులో పలు సంచలనాత్మక విషయాలను వెల్లడించారు. పార్టీ సిద్దాంతాన్ని కాకుండా వ్యక్తి స్వామ్య విధానానికే ఈటల ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కాకుండా ఆయన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీలో చేరినట్టుగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పాదయాత్రలో ఎక్కడ కూడా ప్రధాని మోడీ ఊసు ఎత్తకుండా రాజేందర్ తీసుకుంటున్న చర్యలు.. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.

పాదయాత్రలో జై శ్రీరాం, భారత్ మాతాకి జై అని కార్యకర్తలు నినదించినప్పుడు రాజేందర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ద్వితీయ శ్రేణి కేడర్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హుజురాబాద్ బీజేపీ నాయకత్వంపై ఈటల వ్యవహరిస్తున్న తీరుతో ఆత్మగౌరవాన్ని చంపుకోలేకపోతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీపై అభిమానం ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్టు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా పార్టీతో పెనవేసుకున్న తన అనుబంధానికి గుడ్ బై చెప్తున్నానని ఆయన ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed