ప్రాక్టికల్ విద్య నేర్పుతున్న ప్రకృతి

by Shamantha N |
ప్రాక్టికల్ విద్య నేర్పుతున్న ప్రకృతి
X

అన్నం ఎలా వస్తుంది? అని ఒకప్పుడు పాఠశాలలో సైన్స్ టీచర్ చెప్తే విద్యార్థులు నేర్చుకున్నారు. అదే ప్రశ్న పరీక్షలో వస్తే, పుస్తకంలో ఇచ్చిన సమాచారాన్నే బట్టీ పట్టి జవాబు పత్రం మీద రాసి మార్కులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్నవారికి ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పాఠాలు కొద్దోగొప్పో జరుగుతున్నాయి. కానీ స్మార్ట్‌ఫోన్ సదుపాయం లేని రైతుల పిల్లల సంగతేంటి? వారికి ప్రకృతి టీచర్‌గా మారింది. అవును.. పుస్తకాల్లో నేర్చుకోవాల్సిన అంశాలన్నింటినీ ఇప్పుడు వారికి ప్రకృతే పాఠాలుగా మార్చి రోజూ నేర్పిస్తోంది. ఎలాగంటారా?

ఐదో తరగతి చదువుతున్న చందన, గత ఆరు నెలలుగా ఇంట్లోనే ఉంది. పరిస్థితులు సరిగా ఉంటే ఈపాటికి పొద్దున్నే స్కూల్‌కి వెళ్లి సాయంత్రం అమ్మానాన్న పొలం నుంచి తిరిగొచ్చే వరకు అక్కడే ఉండి పాఠాలు నేర్చుకునేది. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంది. మొన్నటి వరకు అమ్మానాన్న ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వారికి సాయంగా ఏదో ఒక పని చేసింది. ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరిగి స్నేహితులతో ఆడుకుంది. ఇప్పుడు అందరూ పొలాలకు పయనమయ్యారు. ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు అని, తల్లిదండ్రులకు సాయం చేయడానికి చందన కూడా పొలం దగ్గరికి వెళ్లింది. అసలే తెలివైన పిల్ల, నాన్న ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు నాన్న చెప్పిన సమాధానాలు ఆమెకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టాయి.

ఇప్పుడు చందనకు వరి ఎలా నాటువేయాలో తెలుసు, ఎంతకాలానికి బియ్యంగా మారుతుందో తెలుసు, ఎలా అమ్మాలో తెలుసు, రైతుల కోసం ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించీ తెలుసు.. ఇలా ఇంకా చాలా విషయాలనే నేర్చుకుంది. పోయిన ఏడాది ఇదే విషయాన్ని పాఠశాలలో టీచర్ చెబితే చందనకు పెద్దగా ఎక్కలేదు. కానీ నాన్నతో కలిసి ప్రకృతి ఒడిలో నేర్చుకున్నది కదా, ఇక జీవితాంతం గుర్తుండిపోతుంది. తన తండ్రి కేవలం వరి పంటనే వేశాడు కాబట్టి చందనకు వరి గురించి మాత్రమే తెలిసింది. కానీ మిగతా రైతులు కూడా ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఆమెకు కలిగింది. అంతే.. పత్తిలో కలుపు తీసి అప్పుడే ఇంటికి వచ్చిన అమ్మను అడిగింది. చందన ఆసక్తి చూసి తల్లి ఆమెను వేరే వాళ్ల పత్తి చేనుకి తీసుకెళ్లింది. అక్కడ కలుపు అంటే ఏంటి? ఏయే మొక్కలను కలుపు అంటారు? వాటి వల్ల పత్తి మొక్కకు కలిగే నష్టం ఏంటనే విషయాలను అక్కడే ఉన్న పత్తి చేను యజమాని కూతురు గంగను అడిగి తెలుసుకుంది.

కేవలం చందన మాత్రమే కాదు, ఇన్నాళ్లు సిటీలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో కాంక్రీటు అడవిలో పెరిగిన పిల్లలు కూడా ఇప్పుడు ఊర్లలోనే ఉన్నారు. వ్యవసాయ పనులను దగ్గరుండి చూస్తున్నారు. ఎప్పుడో ఆరో తరగతిలో నేర్చుకోవాల్సిన అంశాలను ఇప్పుడే దగ్గరి నుంచి చూసి నేర్చుకుంటున్నారు. ఈ లెక్కన ఇరుకైన గదిలో సంవత్సరాల తరబడి వాళ్లు నేర్చుకునే అంశాల కంటే, ప్రత్యక్షంగా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్న ఈ ప్రకృతి విద్య.. ఎల్లకాలం ఉపయోగపడుతుందనిపిస్తోంది.

Advertisement

Next Story