అభిమాని భర్తను కాపాడిన కన్నడ స్టార్ హీరో

by Shyam |
Kicha Sudeep
X

దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మధ్యే కొవిడ్‌తో బాధపడుతున్న నటి సోను పాటిల్ తల్లికి ఆర్థికంగా సహాయం చేసి ఆదుకున్న సుదీప్.. మహిళా అభిమాని భర్తను కాపాడి వారి పట్ల దేవుడయ్యాడు. సౌమ్య అనే మహిళ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వివరిస్తూ… తాను చనిపోయే వరకు కూడా సుదీప్ పేరు మీద దేవుడికి దీపం వెలిగిస్తానని ఎమోషనల్ అయింది. తన మంగళసూత్రాన్ని నిలబెట్టిన సుదీప్‌కు శతకోటి వందనాలు అంటూ తను చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగించాలని, తనలాంటి మరెంతో మందిని ఆదుకోవాలని కోరింది.

తన భర్త అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించామని.. అప్పుడు రూ. 2 లక్షల వరకు ఖర్చయిందని తెలిపింది. డిశ్చార్జి అయ్యాక కరోనా రావడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకువెళ్తే రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇస్తేనే అడ్మిట్ చేయించుకుంటామని సిబ్బంది చెప్పడంతో చేసేదేమీ లేక బ్లాక్‌లో రూ. 1.5 లక్షల చెల్లించి ఐదు ఇంజక్షన్‌లు తీసుకున్నట్లు వివరించింది. రూ. 50వేలు చెల్లించి హాస్పిటల్‌లో అడ్మిట్ ఐతే.. కోలుకునే సరికి రూ. 1.30 లక్షల బిల్లు అయిందని తెలిపింది. ఆ సమయంలో కిచ్చా సుదీప్ ఆర్థికంగా సహాయం చేసి ఆదుకున్నారని, తనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పింది. కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు సుదీప్ ఫ్యాన్స్.

Advertisement

Next Story