కేంద్ర మంత్రులకు టీఆర్ఎస్ ఎంపీల కీలక ప్రతిపాదనలు

by Shyam |
KK nama
X

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగిలో తెలంగాణ నుంచి ఎంత బియ్యం సేకరించనున్నదో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల దయనీయ పరిస్థితి, వరి సాగు విస్తీర్ణం, దిగుబడి తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్‌కు ఎంపీ కేకే సూచించారు. పార్లమెంటులో మూడు రోజులుగా చేస్తున్న నిరసనలు ఇకపైన కూడా కంటిన్యూ అవుతాయన్నారు. తమిళనాడు, ఒడిషా, కేరళ తదితర రాష్ట్రాల ఎంపీలనూ కలుపుకుపోతామన్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్ర, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉప్పుడు బియ్యాన్ని సేకరించబోమంటూ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఆంక్షలను విధించడం సరికాదని, రైతులు హఠాత్తుగా పంటల మార్పిడి విధానంవైపు వెళ్ళడంలో ఆచరణాత్మక సమస్యలు ఉన్నయన్నారు. కనీసంగా మూడేళ్ల పాటు గడువు ఇచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించారు.

రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితిని, వ్యవసాయ రంగం ప్రగతి గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు వివరించామని, తొలుత కొంటామని తమకు హామీ ఇచ్చి ఆ తర్వాత మాట మార్చారని కేశవరావు ఆరోపించారు. తాము చేస్తున్న ఆందోళనలు, నిరసనల కారణంగానే లోక్‌సభ ఒకసారి వాయిదా పడిందని, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదాపడిందన్నారు. గతేడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన ఐదు లక్షల టన్నుల బియ్యం సేకరణ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నదని గుర్తుచేశారు. ప్రతీ గింజను కొంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యను స్వాగతిస్తున్నామని, దాన్ని ఆచరణలో పెట్టాలని డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డికి దండ వేసి దండం పెడుతాం : నామా నాగేశ్వరరావు

దేశానికి వ్యవసాయం కీలక రంగమని, వెన్నెముకగా ఉన్న రైతులతో రాజకీయం చేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. పార్లమెంటు లోపలా, వెలుపలా నిరసన తెలుపుతూ ఉంటే కొద్దిమంది కామెంట్ చేయడాన్ని తప్పుపట్టారు. కామెంట్లు చేయడానికి బదులుగా పార్లమెంటులో కేంద్రమంత్రితో హామీ ఇప్పించాలని సూచించారు. ఆందోళనలో మృతి చెందిన ఉత్తరాది రైతులకు రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తే భిన్నంగా మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం టీఆర్ఎస్‌కు నైతికంగా అండగా నిలబడాలని కోరారు.

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావడం తెలంగాణ ఎంపీలుగా తమకు సంతోషమని, కేబినెట్‌లోకి వెళ్ళిన వెంటనే ఆయనతో కలిసి సహపంక్తి భోజనం కూడా చేశామని నామా గుర్తుచేశారు. ప్రహ్లద్ జోషికి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ నుంచి బియ్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంతో స్టేట్‌మెంట్ ఇప్పిస్తే దండ వేసి దండం పెడుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed