బరువు తగ్గించే ‘కీటో డైట్’

by Anukaran |   ( Updated:2021-06-16 21:01:30.0  )
Ketogenic Diet for Weight Loss
X

దిశ, ఫీచర్స్ : ‘బరువు తగ్గడం కష్టమైన పనే.. కానీ బరువు మోయడం కూడా కష్టమే’. అయితే ఈ రెండు పనులూ కష్టమే అయినప్పుడు ఏదో ఒకటి ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అందువల్లే ‘ఊబకాయులు’ అనే కాదు, కాస్త బరువు పెరిగిన వాళ్లు సైతం ఎక్స్‌ట్రా వెయిట్‌ తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. భిన్నమైన డైట్ ప్లాన్స్ ఫాలో అవుతుంటారు. అందుకోసం ఉపవాసాలు పాటించడంతో పాటు మాంసాహారానికి దూరంగా ఉండటం వంటివి చేస్తుంటారు. అయితే కఠిన నియమాలతో కాకుండా, సులభంగా బరువు తగ్గే పద్ధతుల్లో ‘కీటో డైట్’ ప్లాన్ ఒకటి కాగా.. 1920లో ఎపిలెప్సీ చికిత్సకు వైద్య విధానంగా ‘కీటోజెనిక్ డైట్’ ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల కాలంలో బరువు తగ్గించే వ్యూహంలో ‘కీటో డైట్’ విధానానికి అధిక ప్రాచుర్యం లభించింది. కీటోసిస్ నుంచే ఈ డైట్ ప్లాన్‌కు ఆ పేరు రాగా.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటి? ఇందులో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దేన్ని దూరం పెట్టాలి? అసలు కీటోసిస్, కీటోన్స్ అంటే ఏంటో? తెలుసుకుందాం..

రోజులో 20-30 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే తీసుకుని శరీరాన్ని ‘కీటోసిస్’ స్థితికి తీసుకురావడమే కీటోజెనిక్ డైట్‌‌ విధానం. ఈ జీవక్రియ స్థితిలో ఉన్నప్పుడు శరీరం తనలోని కొవ్వును కరిగించి కావాల్సిన ఎనర్జీని పొందుతుంది. అయితే శరీరం కీటోసిస్ స్టేజ్‌కు చేరుకోవాలంటే.. కార్బోహైడ్రేట్లు, కొవ్వు తీసుకోవడాన్ని గరిష్టంగా తగ్గించడమే కాకుండా ప్రొటీన్ ఇన్‌టేక్‌ను కూడా పరిమితం చేయాలి. ఎందుకంటే మన శరీరం ‘గ్లూకోనోజెనెసిస్’లో భాగంగా ప్రోటీన్‌ను గ్లూకోజ్‌గా మార్చి శక్తిని పొందుతుంది. కీటో డైట్ ‘కీటోసిస్’ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధానంలో శరీరం నిల్వ చేసిన కొవ్వుతో పాటు తీసుకునే కొవ్వును కూడా బర్న్ చేస్తుంది.

Keto diet2

లేజీ కీటో డైట్ : ఇందులోనూ కార్బోహైడ్రేట్స్‌ను తక్కువ పరిమాణంలో తీసుకునే నియమం ఉంటుంది. కానీ ప్రొటీన్, ఫ్యాట్, కెలోరీలు తీసుకునే విషయంలో ఎలాంటి ఆంక్షలుండవు.
ఉదాహరణకు : లేజీ కీటో డైట్‌లో ఉన్న వ్యక్తి.. భోజనానికి సులభంగా లభించే ఫాస్ట్‌ఫుడ్ మీట్ బర్గర్‌ విత్ ప్రాసెస్డ్ చీజ్ ఆర్డర్ చేసుకుని తినే అవకాశముంది. అదే కీటో డైట్‌లో ఉన్న వ్యక్తి పోషకాలు గల ఆకుకూరలతో పాటు ఆరోగ్యకరమైన జున్ను సాస్‌తో కూడిన గ్రిల్డ్ చికెన్ తినాల్సి ఉంటుంది.

టైప్స్ :

కీటో డైట్‌లోనూ భిన్నరకాల విధానాలున్నాయి.
స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ (ఎస్‌కేడీ) : ఇందులో చాలా తక్కువ కార్బ్‌(10%)తో పాటు మితమైన ప్రొటీన్(20%), అధిక కొవ్వు(70%)గల ఆహారాన్ని స్వీకరిస్తారు.
సైక్లిక్ కీటోజెనిక్ డైట్ (సీకేడీ) : వారంలో 5 రోజులు కీటోజెనిక్ డైట్ ఫాలో అయితే, మిగతా రెండు రోజులు హై కార్బో ఆహార పదార్థాలు స్వీకరిస్తారు.
టార్గెటెడ్ కీటోజెనిక్ డైట్ (టీకేడీ) : వర్కౌట్స్ చేస్తూ కార్బోహైడ్రేట్లు స్వీకరించాలి.
హై ప్రోటీన్ కీటోజెనిక్ డైట్ : ఇది ప్రామాణిక కీటోజెనిక్ డైట్ మాదిరిగానే ఉన్నా, ఎక్కువ ప్రొటీన్స్ కలిగి ఉంటుంది. ఈ నిష్పత్తి 60% కొవ్వు, 35% ప్రోటీన్ 5% పిండి పదార్థాలు.

కీటోసిస్ :

కార్బోహైడ్రేట్ల నుంచి ఉత్పత్తయ్యే గ్లూకోజ్ ద్వారా శరీరం శక్తి పొందుతుందన్నది తెలిసిన విషయమే. అయితే శరీరంలో తగినంత గ్లూకోజ్ లేనప్పుడు కీటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వు పదార్థాలను కరిగించుకుంటుంది. కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం వల్ల కాలేయం కొవ్వును కరిగించి, దాని నుంచి శక్తిని పొందుతుంది. ఈ శక్తి ‘కీటోన్’ అనే కణాల రూపంలో ఉంటుంది.

Keto diet 2

ఆహారం :

కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న మాంసం, చేపలు, నూనె పదార్థాలు, జున్ను తీసుకోవాలి. గుడ్లు, చీజ్, నట్స్ అండ్ సీడ్స్, అవకాడో, గ్రీన్ వెజ్జీస్, టొమాటోలు, ఆనియన్స్, పెప్పర్, హెర్బ్స్, స్పైసెస్ తీసుకోవచ్చు.
అవాయిడ్ : సోడా, ఫ్రూట్ జ్యూస్, స్మూతీస్, కేక్, ఐస్ క్రీమ్, క్యాండీ, పాస్తా, సెరియల్, రైస్, ఫ్రూట్స్, బఠాణి, కిడ్నీ బీన్స్, లెంటిల్స్, బంగాళాదుంపలు, క్యారెట్స్, సలాడ్స్, హనీ, ప్రాసెస్డ్ వెజీ ఆయిల్స్, బీర్, వైన్, లిక్కర్, మిక్స్‌డ్ డ్రింక్స్, పుడ్డింగ్స్, స్వీటెనర్స్ వంటి పదార్థాలు అవాయిడ్ చేయాలి.

ఉపయోగం :

కీటోజెనిక్ ఆహారం వాస్తవానికి ఎపిలెప్సీ (మూర్ఛ) వంటి నాడీ వ్యాధుల చికిత్సలో భాగంగా ఉద్భవించింది. కాగా ఈ డైట్‌పై దశాబ్ద కాలంగా జరిగిన అనేక అధ్యయనాలు.. అనేక రకాల ఆరోగ్య పరిస్థితులకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో ఇది ఉపయోగపడుతుంది. దాంతో పాటు క్యాన్సర్, అల్జీమర్స్, ఎపిలెప్సీ, పార్కిన్‌సన్స్, బ్రెయిన్ ఇంజ్యూరీస్‌తో బాధపడుతున్న వారికి ఈ డైట్ మేలు చేస్తుందని ఆయా అధ్యయనాల్లో తేలింది. కాగా బరువు తగ్గేందుకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ (ఎస్‌కేడీ) బాగా ఉపయోగపడుతుందని మరికొన్ని పరిశోధనల్లో తేలింది.

Keto diet 4

సైడ్ ఎఫెక్ట్స్ :

కీటోసిస్ వల్ల వచ్చే ఫలితాలు చాలా వరకు తాత్కాలికమైనవి, డీహైడ్రేషన్‌కు సంబంధించినవి. దీని వల్ల తలనొప్పి, నోటి దుర్వాసన, అలసట, వికారంగా ఉండటం లాంటి లక్షణాలు తలెత్తొచ్చు.

సాధారణంగా బరువు తగ్గడానికి కీటోజెనిక్ డైట్ మంచిదేనని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచే అవకాశం ఉందని, నిజానికి లో-ఫ్యాట్ డైట్‌తో పోలిస్తే కీటోజెనిక్ డైట్ దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే మీ శరీరం ఏ మేరకు కీటోజెనిక్ డైట్‌కు అనుగుణంగా స్పందిస్తుందనే దానిపై ఇది ఆధారపడుతుంది. మధుమేహం, బ్లడ్ షుగర్ సమస్యలు ఉన్నవారు కీటోజెనిక్ డైట్ ఫలితాల గురించి డాక్టర్ సలహా తీసుకోవాలి. అదేవిధంగా కిడ్నీ సమస్యలు లేదా కుటుంబ చరిత్రలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా డాక్టర్‌ను సంప్రదించాలి.

Keto daiet 5

నిపుణుడి పర్యవేక్షణలో కీటో డైట్‌ను సరిగ్గా పాటిస్తే.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. అయితే ఈ ఆహారం హృదయ సంబంధ వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు తదితర సమస్యలున్న వారికి ఉద్దేశించినది కాదు. దీన్ని ఎక్కువ కాలం కూడా పాటించలేం. ఎందుకంటే ఇది శరీరానికి అవసరమైన పోషకాలను కోల్పోతుంది. ఇక జీరో కీటో డైట్‌లో కార్బ్ తీసుకోవడంపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నందున, తెలియకుండానే తీసుకునే ‘లో క్వాలిటీ ఫ్యాట్స్(ఉదాహరణకు : ట్రాన్స్-ఫ్యాటీ ఆమ్లాలు)’ తరచుగా మంటను కలిగిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వెజ్జీ ఆయిల్స్, రెస్టారెంట్ ఆహారంతో సహా పలు రకాల ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ కనిపిస్తాయి. ఇవి మూత్రపిండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టగలవు.
– డాక్టర్ రోహిణి పాటిల్, న్యూట్రిషనిస్ట్

‘కీటో డైట్‌.. పండ్లు, కొన్ని రకాల కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, పాడి వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను పరిమితం చేస్తుంది. ఇది మీకు అవసరమైన అన్ని పోషకాలను అందించకపోవచ్చు. ఈ విధానంలో ఫైబర్ తక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకానికి కారణమవుతుంది. బరువు తగ్గే అవకాశం ఉన్నా.. వైద్య నిపుణులు లేదా డైటీషియన్‌ల పర్యవేక్షణలో మాత్రమే ఈ విధానాన్ని ఫాలో కావాలి’
– మెలిస్సా మజుందార్, స్పెషలిస్ట్ ఇన్ ఒబెసిటీ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్

Advertisement

Next Story