ఆటోను అడ్డుకోవడంతో.. తండ్రిని భుజాలపైనే..!

by vinod kumar |
ఆటోను అడ్డుకోవడంతో.. తండ్రిని భుజాలపైనే..!
X

తిరువనంతపురం : కేరళలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తండ్రిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటోలో బయల్దేరిన వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో.. తండ్రిని భుజాలపైనే మోసుకెళ్లాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. పోలీసులను వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కొల్లాం జిల్లాకు చెందిన 30 ఏళ్ల రేమన్ పునలూరు తాలూకలోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అవుతున్న 89 ఏళ్ల తన తండ్రి జార్జిని ఇంటికి తీసుకొచ్చేందుకు ఆటోలో బయల్దేరాడు. కానీ, పునలూరు దారి మధ్యలోనే పోలీసులు అతన్ని అడ్డుకుని ఆటో కాగితాలు చూపించమన్నారు. ఆస్పత్రి నుంచి తన తండ్రిని తీసుకెళ్లేందుకు వెళ్లుతున్నానని చెప్పినా పోలీసులు వదల్లేదు. దీంతో ఆటో అక్కడే పెట్టి దాదాపు ఒక కిలోమీటర్ నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లాడు. మండుతున్న ఎండలో తండ్రిని భుజాలపై మోసుకుని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి తిరుగుపయనమయ్యాడు. తండ్రిని మోసుకెళ్లుతున్న్ రేమన్‌ను ఆ పోలీసులు చూసినా.. మిన్నకుండిపోయారు.

ఆస్పత్రికి వెళ్లుతుండగా.. ఆటో డాక్యుమెంట్లు చూపెట్టినా పోలీసులు వదల్లేదని రేమన్ ఆరోపించారు. కాగా, పోలీసులు మాత్రం రేమన్ డాక్యుమెంట్లు చూపించలేదని, లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్న ఘటనలున్నందువల్లే అతనిని అనుమతించలేదని తెలిపారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సూమోటోగా స్వీకరించి పోలీసుల నుంచి వివరణ కోరింది.

Tags: coronavirus, kerala, police, carried on shoulder, father, video, human rights commission

Advertisement

Next Story

Most Viewed