అధికారులు ఎక్కడున్నరు.. కీసర గ్రామస్తులు ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-08-24 08:58:25.0  )
Keesara grama sabha
X

దిశ, కీసర: అధికారులు లేకుండా గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారని కీసర గ్రామస్తులు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సర్పంచ్ నాయకపు మాధురి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సభ మొదలు కాగానే గ్రామంలో సీసీ రోడ్లు లేవని గ్రామస్తుడు చిక్కుడు రమేష్ వెల్లడించారు. సీసీ రోడ్లు ఉన్నచోట నల్ల కనెక్షన్‌ల పేరుతో ఇష్టానుసారంగా తొవ్వారని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్డులో ఏర్పడ్డ గుంతలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. హరితహారం మొక్కలు ఉన్నచోటనే కొత్త మొక్కలు నాటుతూ ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. కీసర దాయార కాలనీకి చెందిన బాబు యాదవ్ మాట్లాడుతూ.. దాయారలో ముగ్గురికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు వచ్చాయని, అర్హులైన వారికి రేషన్ కార్డులు అందలేదని వాపోయారు.

సమస్యలను విన్నవించుకుందామంటే అధికారులు ఎవరూ గ్రామసభకు రాకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులెవ్వరూ రానప్పుడు గ్రామసభ ఎందుకు అని సర్పంచ్‌ను నిలదీశారు. అలాగే హరితహారం విషయంలో సర్పంచ్ మాధురి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ సమావేశం ముగుస్తున్నట్లుగా చెప్పి, సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు పూర్తి అసహనంతో సభను ముగించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలమణి, కార్యదర్శి శ్రీనివాసు, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed