హుజురాబాద్‌పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్.. గ్రౌండ్ లెవల్‌లో సీరియస్ వర్క్..

by Anukaran |   ( Updated:2021-10-09 00:34:10.0  )
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : విలేజ్ టు విలేజ్, ఓటర్ టు ఓటర్ ఇలా ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అన్ని కోణాల్లోనూ సర్వే చేయిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎంత మేర పెరిగింది. ప్రత్యర్థి ఓటమి ఖాయం అయిందా లేదా అన్న అంశంపై అన్ని కోణాల్లో ఆరా తీయిస్తున్నారు. ఓ వైపున నిఘా వర్గాలు, మరో వైపున సర్వే ఏజెన్సీలు, మీడియా సంస్థలు ఇలా అవకాశం ఉన్న ప్రతీ ఏజెన్సీతో గ్రౌండ్ రియాల్టీపై ఆరా తీయిస్తున్నారు.

మారిన పర్సెంటేజీ ఎంత..

ఐదు నెలలుగా ప్రచారంతో పాటు పథకాలతో హుజురాబాద్ ఓటర్లను ఆకట్టుకుంటున్న అధికార పార్టీ ఇప్పటి వరకు ఓటర్లను అనుకూలంగా ఎంత మేర మల్చుకోగలిగింది, ఇంకా ఎంతమేర మల్చుకోవాలి అన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యర్థి ఈటల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతమేర సక్సెస్ అయ్యామో తెలుసుకుని ఆధిక్యత కోసం ఎలాంటి వ్యూహంతో వ్యవహరించాలి అన్న విషయంపై బేరీజు వేసుకునే పనిలో పడింది. ఇంతకాలం సంక్షేమ పథకాలు, తాయిలాలు ప్రకటించగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా ఓటర్లను కలిసి ప్రచారం ఎలా చేయాలి అన్న విషయంపై ఆరా తీయడంలో నిమగ్నమైంది. ఏది ఏమైనా హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురేయాలన్నదే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

సర్వేలపై సర్వే..

సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ఈ విషయంలో పలు రకాలుగా సేకరించిన సర్వేలపై రీ సర్వే చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. నిఘా వర్గాల నివేదికలు, ఏజెన్సీలు, మీడియా సంస్థలు చేసిన సర్వేలన్నింటినీ బేరీజు వేసుకుంటూ లోతుగా అధ్యయనం చేసేందుకు మరికొంతమందిని నియమించినట్టు సమాచారం. ఓటర్లను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ అన్న విషయంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. మరో 21 రోజుల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో అప్పటికల్లా హుజురాబాద్‌లో పైచేయి నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ప్రధానంగా దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించిందన్న నివేదికల ఆధారంగా చివరి నిమిషంలో ఫెయిల్ అయ్యామని భావిస్తున్న అధిష్టానం ఇక్కడ మాత్రం ఫెయిల్ కావద్దని నిర్ణయించుకుంది.

అడుగడుగునా నిఘా..

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంటలిజెన్స్ వర్గాలే కాకుండా ఇతరత్రా విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులను కూడా రంగంలోకి దింపినట్టు సమాచారం. వీరంతా ప్రజలతో మమేకమై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటలకు ఉన్న సానుకూలత ఏంటీ, టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత ఏంటీ అనే విషయంపై బ్రీఫ్ నోట్స్ తెప్పించుకుంటున్నట్టు సమాచారం. కూలంకశంగా ఈ నివేదికలన్నింటిపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed