కొందరి హైదరాబాద్ వద్దు-'అందరి హైదరాబాద్' ముద్దు: కేసీఆర్

by Shyam |
కొందరి హైదరాబాద్ వద్దు-అందరి హైదరాబాద్ ముద్దు: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ముమ్మాటికీ సెక్యులర్ నగరమేనని, ఎన్నో మతాలు, ప్రాంతాలు, కులాలకు చెందిన వారు నివసించే ‘మెల్టింగ్ సిటీ’గా గుర్తింపు పొందిందని, ఇకపైన కూడా దీన్ని ఇంతకంటే గొప్పగా ఉంచుకోవాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సింధీ కాలనీ, గురజాతీ గల్లీ, పార్శీగుట్ట లాంటి ప్రాంతాల్లో పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుదీర్ఘకాలంగా నిర్భయంగా ఉంటున్నారని, ఈ సంస్కృతి ఇలాగే కొనసాగేలా చూసుకోవాలన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను కేంద్ర కార్యాలయంలో సోమవారం విడుదల చేసిన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ఈసారి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, అనాలోచితంగా వ్యవహరించవద్దని సూచించారు. ఏడేళ్ళుగా టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి కర్ఫ్యూ లేకుండా, మత ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా నగరంలో ఇప్పుడు కొన్ని శక్తులు, కొద్దిమంది వ్యక్తులు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మత విభజన తీసుకొస్తున్నారని, అలాంటివాటికి తావు ఇవ్వరాదని కోరారు.

పూల బొకే లాంటి నగరం
దేశంలోని కాస్మొపాలిటన్ నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, నలుమూలల నుంచి వచ్చినవారిని ఒడిలో పెట్టుకుని అక్కున చేర్చుకుందన్నారు. ఎందరికో అలవాలంగా ఉన్న ఈ నగరంలో బెంగాలీ, ఆర్య, మలయాళీ లాంటి అనేక సమాజాలు ఉన్నాయని, తెలంగాణ సంస్కృతిలో లీనమై బతుకుతున్నారని పేర్కొన్నారు. పూల బొకే లాంటి హైదరాబాద్ నగరం ఖ్యాతి ఇకపైన కూడా ఇలాగే వర్ధిల్లాలన్నారు. ఎంతో గొప్పగా వృద్ధి చెందిన ఈ నగరం ఐటీ రంగంలో మేటిగా ఉందని, దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఇంకో మెట్టు ఎదిగే వాతావరణం ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఏడేళ్ళుగా నగరంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, కర్ప్యూలు లేవని, కత్తిపోట్లు అసలే లేవన్నారు. దేశానికే తలమానికంగా ఉండేలా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ తుది మెరుగులు దిద్దుకుంటోందని, రూ. 300 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు రూ. 565 కోట్లకు చేరుకుందన్నారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, శాంతి భద్రతల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచేస్తామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అవసరమని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పారు.

రెండు జాతీయ పార్టీలు అట్టర్ ఫ్లాప్
దేశాన్ని అభివృద్ధి చేయడంలో రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ఒక దిశ, దశ చూపించడంలో వైఫల్యం చెందాయన్నారు. దేశానికి మార్గనిర్దేశం చేయడంలో విఫలమయ్యాయన్నారు. ఇంతకాలం దేశాన్ని ఏలిన ఈరెండు పార్టీల నేతలకు సామాజిక అవగాహన లేకుండా పోయిందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఫెయిల్ అయ్యాయని, కచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని, అది పుట్టుకొస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలతో పోలిస్తే దేశ జీడీపీ గణనీయంగా పడిపోయిందని, మైనస్‌లోకి వెళ్ళిందని గుర్తుచేశారు. అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక వృద్ధి చాలా మెరుగ్గా ఉందని, కరోనాతో కొంత నష్టం జరిగినా త్వరగానే కోలుకుంటున్నామని అన్నారు. దేశమే సాధించలేని ప్రగతిని తెలంగాణ సాధించిందన్నారు.

Advertisement

Next Story