మా దగ్గర పక్కా వ్యూహం ఉంది.. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం : బండి

by Shyam |   ( Updated:2021-08-11 21:45:52.0  )
Bandi sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ తన అరాచక పాలన నుంచి ఇప్పటికైనా బయటపడాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయన జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, అది ఖాయమని, తమ పార్టీ అధ్యక్షుడు తమకు ఇదే చెప్పారని అన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపించడానికి బీజేపీ దగ్గర పక్కా వ్యూహం ఉందన్నారు. ఇప్పుడు పోడు భూముల విషయంలో ఆదివాసీలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నదని, వారి కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారని, త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇలాగే ఏడ్చే రోజులు వస్తాయన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఆ దిశగా కార్యచరణే లేదని బండి సంజయ్ గుర్తుచేశారు. ఎన్నికలు ఉన్నప్పుడే కేసీఆర్ బయటకు వస్తుంటారని, అప్పుడే ఆయనకు హామీలు గుర్తుకొస్తాయని, మళ్ళీ మర్చిపోవడం ఆయన లక్షణం అని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా ఎల్లన్ననగర్‌లో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే 19 మంది మహిళలను కొట్టి వారిపై హత్యాయత్నం కేసు పెట్టారని, చిన్నారులను, బాలింతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పత్రికల్లో టీవీ చానెళ్లలో వచ్చిన వీడియోలను, ఫోటోలను చూసైనా కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు.

పేద మహిళలపై పోలీసులు దాడికి పాల్పడ్డారని, వ్యవసాయం చేసుకునే మహిళలను అరెస్ట్ చేసినందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమానవీయ చర్యలకు పాల్పడిన ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలని, బాధిత మహిళలకు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నదీజలాల బోర్డులపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి

గోదావరి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం గతంలోనే వేర్వేరు బోర్డులను ఏర్పాటు చేసిందని, నదీజలాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు వాటి పరిధిని నోటిఫై చేసిందని, కానీ అవి ఏర్పాటుచేసిన సమావేశాలకు మాత్రం తెలంగాణ డుమ్మా కొట్టిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు బోర్డుల పరిధిని నోటిఫై చేసిన తర్వాత ఆ సమావేశానికి ఇరు బోర్డుల అధికారులు, ఏపీ ప్రతినిధులు హాజరైనా తెలంగాణ మాత్రం గైర్హాజరైందని గుర్తుచేశారు. ఎందుకు హాజరు కాలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నదీ జలాల విషయంలో రాష్ట్రానికి కేసీఆర్ న్యాయం చేయాలనుకుంటున్నారా లేక అన్యాయం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ సమావేశానికి హాజరైనట్లయితే ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నిలదీయడానికి అవకాశం ఉండేదని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం ఉండేదన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణాకి 555 టీఎంసీలు రావాల్సి ఉంటే కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నారని, ఆ ప్రకారమే 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపు జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు, అప్పటి నీటి సలహాదారు విద్యాసాగర్ రావు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటా ఒప్పందానికి అంగీకరించినందునే సంతకాలు కూడా జరిగాయన్నారు. కేటాయింపు ప్రకారం వచ్చిన 299 టీఎంసీలను కూడా తెలంగాణ వాడుకోలేకపోతున్నదన్నారు. ఏపీ మాత్రం కేటాయించిన నీటి కంటే 150 టీఎంసీలను అదనంగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు.

బోర్డుల సమావేశాలకు హాజరైతే తెలంగాణకు న్యాయం జరుగుతుందిగానీ ప్రాజెక్టు డీపీఆర్‌లు ఇవ్వాల్సి వస్తుందని, బడ్జెట్ అంచనాలన్నీ బయటకు వస్తాయనే భయంతోనే ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టిందని ఆరోపించారు. నీటి కోసమే తెలంగాణ ఏర్పడిందని, కానీ ముఖ్యమంత్రిగా స్వరాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహిగా మారారన్నారు. ఇకపైన బోర్డుల సమావేశాలకు కేసీఆర్ హాజరై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదన్నారు.

Advertisement

Next Story