- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూడాల డిమాండ్లకు సర్కార్ ఓకే
దిశ, తెలంగాణ బ్యూరో : సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో సమ్మె చేయడం మంచిది కాదని చెప్తూనే వారి డిమాండ్లను తక్షణం పరిష్కరించాల్సిందిగా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇప్పుడిస్తున్న గౌరవ వేతనానికి 15% అదనంగా చెల్లించాలని, మూడేండ్ల వైద్య విద్యను అభ్యసించి ప్రస్తుతం కొవిడ్ డ్యూటీలు చేస్తున్న విద్యార్థులకు కూడా అదే తీరులో ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విధుల్లో చనిపోయిన వైద్యులకు ఎక్స్‌గ్రేషియా అమలవుతూనే ఉందని, దాన్ని కూడా వారి కోరిక మేరకు సత్వరం అందేలా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో భాగంగా కొవిడ్ బారిన పడిన వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ‘నిమ్స్‘ ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్స అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
వైద్యారోగ్య శాఖ అధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె గురించి ఆరా తీశారు. వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు సీఎం సూచించారు. జూనియర్ డాక్టర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే వున్నదని, ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని సీఎం స్పష్టం చేశారు.
జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదని, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయం సందర్భం లేకుండా సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా అత్యవసర పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జూనియర్ డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ స్థాయిలో స్టయిఫండ్ ఇస్తున్నదని సీఎంకు వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. అయినా జూనియర్ డాక్టర్లు నాలుగైదు డిమాండ్లు పెట్టినందున వెంటనే వాటిని పరిష్కరించాలని ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.