- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ తనయ కవితక్క రీ ఎంట్రీ!
దిశ, న్యూస్ బ్యూరో: నిజామాబాద్ లోక్‌సభ నుంచి ఓడిపోయిన తర్వాత ప్రధాన స్రవంతిలో లేకుండా తెరవెనకనే ఉండిపోయిన మాజీ ఎంపీ కవిత మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఏ హోదా లేకపోవడంతో దాదాపు ఏడాది కాలంగా ప్రజల మధ్యకు వెళ్ళలేకపోయారు. బతుకమ్మ, బోనాలు లాంటి ఉత్సవాల్లో సైతం నామమాత్రంగానే పాల్గొన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ కరోనా కారణంగా ఆ ఎన్నిక వాయిదాపడింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని గందరగోళంలో మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్ళాలనుకుంటున్నారు. సింగరేణి బొగ్గు గనుల అంశాన్ని అందుకు సరైన సందర్భంగా భావించారు. బొగ్గు మైనింగ్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే నిరసన కార్యక్రమాలను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె ఇకపైన జరగబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు విధానపరమైన నిర్ణయాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉంది. కోల్ మైనింగ్ ప్రైవేటీకరణ విషయాన్ని కూడా వ్యతిరేకిస్తూ మళ్ళీ కార్మికులతో టీఆర్ఎస్ మమేకం కావడం, ఎన్నికల్లో గెలుపొందడం కోసం వినియోగించుకోవాలనుకుంది. అందులో భాగంగా టీబీజీకేఎస్ నాయకులతో కవిత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కార్మికులను కూడగట్టి ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. జూలై 2వ తేదీన ఒక రోజు సమ్మెకు దిగాలని ఆమె పిలుపునిచ్చారు. త్వరలో కార్మికులతో నేరుగా కలిసేలా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది.
అధికార సంఘం గుర్తింపు హోదా కోసం..
రెండేళ్ళ క్రితం జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో మొత్తం పదకొండు డివిజన్లలో తొమ్మిదింటిలో టీబీజీకేఎస్ గెలిచింది. మిగిలిన రెండుచోట్ల వామపక్షాల అనుబంధ సంఘాలు గెలిచాయి. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బొగ్గు బావులున్న నియోజకవర్గాల్లో చేదు అనుభవమే ఎదురైంది. రామగుండం, భూపాలపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం తదితర పలుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. టీబీజీకేఎస్‌కు చెందిన కెంగర్ల మల్లయ్య కూడా అధికార పార్టీతో విసిగిపోయి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రభావం త్వరలో జరగబోయే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలపై పడకుండా ఇప్పటి నుంచే టీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది.
టీఆర్ఎస్‌లో ఉన్న పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సైతం బీజేపీలో చేరారు. రామగుండం నుంచి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ కూడా పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధికార పార్టీ సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నందున మరోసారి గుర్తింపు సంఘంగా గెలవడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది.
బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్..
సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు ఆ సంస్థ వరకు మాత్రమే పరిమితమైనప్పటికీ చివరకు ఇది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వర్సెస్ వామపక్షాల మధ్య పోటీగా మారనుంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ ఎంపీలు గెలుపొందడం టీఆర్ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. బీజేపీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇపుడు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పునరావృతం కాకుండా వ్యూహం సిద్ధమైంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీకి చెందిన కార్పొరేటర్లను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నట్లుగానే ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో సైతం వామపక్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనూ, బీజేపీ బలోపేతం అవుతున్నచోట్లా అదే తరహా వ్యూహాన్ని అమలుచేయాలనుకుంటోంది.
టీబీజీకేఎస్‌లో నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను, గ్రూపు తగాదాలను పరిష్కరించి సంఘంలో చీలిక రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన తర్వాత టీఆర్ఎస్ పార్టీతో అమీతుమీ అన్నట్లుగానే రాజకీయ యుద్ధం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ సింగరేణి ఎన్నికల్లోనూ ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీల ప్రభావంతో పాటు పెద్దపల్లిలో బీజేపీకి చెందిన వివేక్ ప్రభావాన్ని కూడా టీఆర్ఎస్ తీవ్రంగానే పరిగణిస్తోంది. నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కవిత త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు ఆలోచన చేస్తున్నందున మళ్ళీ ప్రజల మధ్యకు రావడం దాదాపు ఖరారైంది.